ఆర్ధిక సంక్షోభం లో ఆయిల్ఫెడ్

– ఈ ప్రాంతం ఆదాయంతో ఇతర ప్రాంతాల్లో అభివృద్ది
– గెలలు ధరలు తగ్గుముఖం పై రైతుల్లో ఆందోళన
– ఐక్యతా పోరాటాలే శరణ్యం
– తెలంగాణ ఫాం ఆయిల్ రైతు సంఘం కన్వీనర్ పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట :ఆయిల్ఫెడ్ ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది అని,ఫాం ఆయిల్ గెలలు ధర ఈ ఏడాది మొత్తం తగ్గిపోవడమే దీనికి మంచి ఉదాహరణ అని తెలంగాణ ఆయిల్ ఫాం రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయన బుధవారం ఆయిల్ ఫాం పరిశ్రమ సందర్శించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణ ఆయిల్ఫెడ్ పరిధిలో 32 జిల్లాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నాం అని ప్రచారం చేస్తున్నప్పటికీ కేవలం రెండు మూడు (ఉమ్మడి ఖమ్మం) జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం సాగు విస్తీర్ణం సుమారుగా 80 వేల ఎకరాల్లో ఉన్నది అని తెలిపారు. ప్రస్తుతం 40 వేల ఎకరాల లో నుండి మాత్రమే గెలలు దిగుబడి అవుతున్నాయి అని, గతేడాది 2.64  లక్షల టన్నుల గెలలు,ఈ ఏడాది 2.70 లక్షల టన్నుల గెలలు మాత్రమే దిగుబడి అయ్యాయి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ఫాం కు మద్దతు ధర లేకపోవడం వలన గెలలు ధర విపరీతంగా పడిపోయింది. గతేడాది పోలిస్తే టన్ను గెలలు ధర సగానికి సగం తగ్గుముఖం పట్టింది.గత ఏడాది మే లో టన్ను గెలలు రూ.23 వేలు ధర పలుకగా, ఈ ఏడాది ఈ నెల లో రూ.12231 లు మాత్రమే ఉంది. గత అనేక ఏండ్లుగా పోగు బడిన ఆయిల్ఫెడ్ సంపదను, నిధులను ఇతర జిల్లాల్లో సాగు విస్తీర్ణం సాకుతో జాతరలో ఖర్చు చేసినట్లు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో సాగు విస్తరణకు, పరిశ్రమలు ఏర్పాటుకు, ఇతర వ్యయానికి ఆయిల్ఫెడ్ ఆదాయం నుండే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆయిల్ఫెడ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ,తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో పడ్డట్లు తెలుస్తుంది. అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమలను తాకట్టు పెట్టడం ద్వారా వచ్చే డబ్బులతో రైతు ప్రదర్శనలు, అవగాహన సభలు, టూర్ లు, నూతన భవనాలు, పరిశ్రమలకు శంకుస్థాపనలు, నూతన నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రైతుల గెలలు కు చెల్లించే బిల్లుల పేమెంట్ నేడు 14 రోజులు కావస్తున్నా కనీసం సమాచారం ఇచ్చే దిక్కూ మొక్కు లేదు. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక రైతులు గట్టిగా అడిగితే ఏవేవో కుంటి సాకులు చెప్పుతూ అధికారులు సమాధానం దాట వేస్తున్నారు అన్నారు. ప్రస్తుతం రెండు ఫాం ఆయిల్ పరిశ్రమల్లో సుమారుగా 45 వేల మెట్రిక్ టన్నుల ముడి నూనె ఉత్పత్తి అవుతుంది. ఇదే ప్రాంతంలో  నిర్మిస్తామని హామి ఇచ్చిన  రిఫైనరీ,  ప్రాసెసింగ్ యూనిట్లను ఇపుడు సిద్దిపేట లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు గా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో అనువైన నేల – సమృద్దిగా నీరు –  ముడి నూనె ఉత్పత్తి చేసే రెండు పరిశ్రమలు అందుబాటులో ఉంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు  సోమలింగం సామెత లా ఏమీ లేని ఎడారిలో ఫాం ఆయిల్ హబ్ ను ఏర్పాటు చేసే ఆలోచనను విడనాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ రెండు పరిశ్రమలు పరిధిలోనే ఈ ఫాం ఆయిల్ హబ్ ను తక్షణమే ఏర్పాటు చేయాలి. అపుడే అన్ని వనరులు అనువుగా, రైతులకు సౌకర్యంగా ఉండే ఈ ప్రాంతంలోనే నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్యాక్టరీకి తరలించిన గెలలు కు అధికంగా కాండం తో ఉన్నాయని, గెలలు పచ్చివి గా ఉన్నాయని నిబంధనల పేరుతో ఒక్కో లోడు కు 20 నుండి 100 కేజీలు వరకు తరుగు పేరుతో గెలలు తిరస్కరించే విధానాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఫ్యాక్టరీ లో గెలలు దిగుమతి చేసుకున్న వెంటనే రైతులకు పంపే తూనికలు సందేశాన్ని పునరుద్ధరణ చేయాలి. పైన తెలిపిన సమస్యలు పరిష్కారానికి ఆయిల్ఫెడ్ చర్యలు చేపట్టకపోతే ఆయిల్ ఫాం రైతులు ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది.
ఈ సమస్యలు సాధన కోసం పార్టీలు, రాజకీయాలకతీతంగా ఐక్య పోరాటాలు చేయాలని సాగుదారుల కు విజ్ఞప్తి చేస్తున్నాం.