– రాజ్యసభలో ఏకగ్రీవ ఆమోదం
– అనుకూలంగా 171 ఓట్లు
– వ్యతిరేకంగా జీరో
– రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉన్నది
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను నిర్ధారించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 171 ఓట్లతో ఏకగ్రీవ ఆమోదం పొందింది. ఒక్కరూ కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. రాజ్యాంగ సవరణ కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు చట్టంగా మారుతుంది. అయితే చట్టం వచ్చిన తరువాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి ఏండ్లు పడుతుంది. తదుపరి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్ నిబంధన అమల్లోకి వస్తుందనే అనిశ్చితి నెలకొంది. బిల్లు ఆమోదం కోసం పరిశీలించిన రాజ్యసభలో జరిగిన చర్చలో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని గట్టిగా ఎంపీలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ప్రభుత్వం కూడా వెనుదిరిగింది. ఎన్నికల ముందు ఈ బిల్లు మోసం మాత్రమేనని, లేకుంటే త్వరలోనే అమలులోకి వచ్చేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్‌సభలో ఈ బిల్లు బుధవారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగింది.
మహిళా బిల్లు ప్రధాని దయ కాదు
ఈ బిల్లులోని నిబంధనలు మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రధాని దయ కాదని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం మహిళలను ఎంతగా గౌరవిస్తుందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతి రేకంగా జంతర్ మంతర్ ఎదుట రెజ్లర్లు చేపట్టిన ఆందోళన, మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. మహిళలు హక్కులను కోరుకుంటున్నారని, జాలి కాదని స్పష్టం చేశారు.
వెంటనే అమలు చేయాలి
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జయా బచ్చన్ ప్రసంగిస్తూ.. మహిళలను గౌరవించే ఈ సంప్రదాయం ‘ఆడంబరం’గా ఉండదని తాను ఆశిస్తున్నానని, ఇది ఇంకా కొనసాగుతుందని అన్నారు. లేకపోతే.. సభలోని మహిళల్ని మిమ్మల్ని (రాజ్యసభ చైర్మెన్ జగ్‌దీప్ ధన్కర్) ప్లాస్టిక్ సర్జన్ అని పిలుస్తారని ఛలోక్తులు పేల్చారు. మీ (జగ్‌దీప్ ధన్కర్) కుర్చీ చాలా ఆసక్తికరంగా ఉందని, అదొక ఉయ్యాల తరహాలో అటూ ఇటూ కదులుతుంటుందని అన్నారు. అయినా.. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము ఎవరని ప్రశ్నించారు. తమకు ధైర్యం ఉంది కాబట్టి తాము పార్లమెంట్‌లో అడుగుపెట్టామని, తమ నాయకుల్లో ధైర్యం ఉంది కాబట్టే వాళ్లు తమని ఇక్కడికి తీసుకొచ్చారని అన్నారు. కానీ.. మహిళల్ని తీసుకురావాల్సిన వారు ఏం చేస్తున్నారో తెలియడం లేదని.. బీజేపీకి చురకలంటించారు. ఎన్నికలు జరుగుతాయా, లేవా..? గెలిపిస్తారా, గెలిపించరా? అనేది తెలియదని చెప్పారు. ఎక్కడి నుంచైతే ఓడిపోతారే, అక్కడే మహిళలకు వాళ్లు (బీజేపీ) టికెట్లు ఇస్తారని కౌంటర్ వేశారు. ఇప్పుడు ఈ డ్రామాని ఆపాలని పార్లమెంట్‌లో ఉద్ఘాటిం చారు. ఇంతలో పార్లమెంట్‌లో ఉన్న బీజేపీ నేతలు అడ్డుకోవడంతో.. జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
”మీరు బిల్లు సమర్పించేశారు. ఇప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీరు అడ్డుకుంటే మాత్రం.. మీకు వ్యతిరేకంగా అభ్యంతరం తెలుపుతాను. మేం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పనివ్వండి” అంటూ ఫైర్ అయ్యారు. ఈ బీజేపీ వాళ్లు ప్రతీ చిన్న విషయంపై కామెంట్లు చేస్తారని, అదే తాము చేస్తే మాత్రం వీళ్లకు కోపం నషాళానికి ఎక్కుతుందంటూ సెటైర్లు వేశారు. అనంతరం.. ఈ బిల్లు గతంలో కూడా వచ్చిందని, ఆ సమయంలో సుష్మా స్వరాజ్‌తో పాటు బృందా కరత్ అద్భుతమైన ప్రసంగాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు లోక్‌సభలో ఆమోదం పొంది బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, దీనికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే.. ఈ బిల్లులో ఒక అంశం తనని కలచివేస్తోందని జయా బచ్చన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం టిక్కెట్లు ఇవ్వాలని మీరు కోరుకుంటే.. ముస్లిం మహిళలకు ఎన్ని టిక్కెట్లు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. మీకు ధైర్మం ఉంటే.. బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం పొందిందని కేవలం డప్పు కొట్టుకుంటే సరిపోదని, బిల్లుని అమలు చేసి, అప్పుడు ప్రచారం చేసుకోండని ఛాలెంజ్ చేశారు. మీరు ప్రతి చిన్న విషయానికి అనవసరమైన ప్రచారం చేస్తుంటారని బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బిల్లు మోసం కాదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బిల్లు మోసం కాదని పేర్కొ న్నారు. చట్టం ప్రకా రం, తదు పరి పునర్విభజన 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ముందు రిజర్వేషన్లు తీసుకు రాలేము. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజక వర్గాల పునర్విభ జన జరగనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు త్వరగా పూర్తవు తాయి. మహిళా రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ మద్దతి స్తోంది. కాబట్టి చిత్తశుద్ధిపై సందేహం లేదు. రాజ్యసభలో, దాని ఎన్నికల వ్యవస్థ కారణంగా, మహిళలకు రిజర్వేషన్ సాధ్యం కాదు. మహిళా రిజర్వేషన్ అమలు కోసం గతంలో చేసిన ప్రయత్నాలను వివరిస్తున్నప్పుడు ఎన్నో అందమైన క్షణాలు గుర్తుకు వస్తాయి. 2010లో రాజ్యసభ బిల్లును ఆమోదించిన తర్వాత పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన బౄందా కరత్‌ను సుష్మా స్వరాజ్ కౌగిలించుకుని అభినందించారు. గీతా ముఖర్జీ సహా పలువురు మహిళా నేతలు రిజర్వేషన్ల కోసం గట్టిగా నిలబడ్డారని నిర్మలా అన్నారు.
ప్రభుత్వం స్పష్టం చేయాలి. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే
ఏ సంవత్సరం..ఏ నెలలో అమలు చేస్తారో స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేయాలి. మహిళా రిజర్వేషన్‌ని జనాభా లెక్కలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సీట్ల ఆధారంగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. జనాభా లెక్కలు, పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరిగినప్పుడు రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్యను పెంచవచ్చని ఖర్గే సూచించారు. దీనిపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందిస్తూ.. రిజర్వేషన్ల అమలుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోదీ పాలనలో ఏదైనా సాధ్యమేనని అన్నారు. రాజ్యాంగం ప్రకారం జనాభా గణన జరుగుతుందని, జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు తదితరాలు ఉండాలని, అందుకే బిల్లులో భాగంగా చేశామని మంత్రి చెప్పారు. ఓటింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సభకు చేరుకున్నారు. అంతకుముందు లోక్‌సభలో మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని, బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి ఆదర్శంగా నిలవాలని ప్రధాని అన్నారు. ఉభయ సభల్లో బిల్లుపై 132 మంది ఎంపీలు మాట్లాడారని, బిల్లుపై ఏకాభిప్రాయం ప్రజల్లో విశ్వాసం నింపుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి’కి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మహిళలు మరింత ఆత్మవిశ్వాసంతో నాయకత్వం వహిస్తారని మోడీ అన్నారు. రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారో, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ విషయంలో తన స్టాండ్ ఏమిటో మోడీ వివరించలేదు.
మరోవైపు లోక్ సభలో చంద్రయాన్ -3 ద్వారా ఇస్రో సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది. ఈ ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్ 3 విజయం దేశాన్ని గర్వించేలా చేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అభివద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగేందుకు యత్నిస్తున్నాయని.. కానీ భారత్ ఆ విజయాన్ని సాధించి.. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా ప్రపంచంలో ఖ్యాతిని సొంతం చేసుకుందని అన్నారు.