జీవిత సంధ్యాకాలం వృద్ధాప్యం

వ్యక్తి యాభై లేదా అరవై సంవత్సరాలు నిండగానే అంతా అయిపోయింది అనే భావన కారణంగా డిప్రెషన్‌, ఒత్తిడితో నిరాశ, నిస్పృహకు లోనై తాను ఏ పనీ చేయలేనని అనుకుంటూ బతకలేక బతుకుతుంటాడు. ముసలితనాన్ని శాపంగా భావిస్తూ లోలోన మదనపడుతుంటాడు. వృద్ధాప్యం లేదా ముసలితనం మానవ జన్మలో చివరిదశ. ఈ దశలో మనిషిలోని ప్రతి అంగం కొంత శక్తిని కోల్పోతుంది. రోగ నిరోధకశక్తి బలహీనపడడంవల్ల ప్రతి చిన్న వ్యాధి దండయాత్ర చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను పరిశోధించే విభాగాన్ని జిరియాట్రిక్స్‌ అంటారు.
ముసలితనంలో కూడా కొందరు సంతోషంగా వుంటారు. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తూ నెమ్మదిగానైనా తమ పనులు తాము చేసుకుంటూ ఏ విషయాన్నీ జఠిలంగా భావించక సానుకూలంగా ఆలోచిస్తారు. వృద్ధాప్యంలో వచ్చే వాటన్నింటిని సహజమే అనే దృక్పథంతో చీకూ చింతా లేకుండా జీవిస్తుంటారు.
ఆచార్య ఎన్‌.గోపి ‘వృద్ధోపనిషత్తు’ అనే తన గ్రంథంలో వృద్ధాప్యాన్ని ‘జీవన సారాంశ దశ’ అంటారు. అంతేగాక పరిణత దశ అని, బౌద్ధిక శక్తితో కూడుకున్నదంటారు.
వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? అనే విషయాన్ని సుదీర్ఘ కాలం సాగిన పరిశోధనల్లో వెల్లడైన అంశాలను ‘సైన్స్‌ ఆఫ్‌ ఏజింగ్‌’ అనే పేరుతో విడుదల చేసిన అంశాల్లో అనేక విషయాలు వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు పరిశోధకులు. అందులో ముఖ్యులు, స్పెయిన్‌ శాస్త్రజ్ఞుడు డా||సెర్రానో ”వృద్ధాప్యంలో శారీరక మార్పులు ప్రతి వ్యక్తిలోనూ తప్పనిసరిగా జరుగుతుంటాయి. వీటికి కారణం జీవన విధానం, తల్లిదండ్రులు వారి పూర్వీకుల నుండి సంక్రమించే జన్యువుల ప్రభావంవల్ల వృద్ధాప్యం కొందరిలో ముందూ, మరికొందరిలో ఆలస్యంగా రావచ్చని అంటాడు.
కొందరిలో రావలసిన వయసుకంటే ముందే వచ్చే వృద్ధాప్యాన్ని అకాల వృద్దాప్యం, ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తారంటాడు డా||సిర్రానో. దీనికి అనేక కారణాలుంటాయి అంటాడు. ముఖ్యంగా ఆచరించే జీవన శైలి, ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, పర్యావరణం వంటి వాటితో చిన్న వయసువారు వృద్ధులుగా కనుపడుతుంటారు. ఈ అకాల వృద్ధాప్యం రాకుండా వుండాలంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటారు మన శాస్త్రజ్ఞులు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం, కాలకృత్యాల తర్వాత కొంచెం సేపు దేహపరిశ్రమ, ఆరుబయట నడుస్తుండాలి. ఉదయం పూట ఏదైనా ఉపాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం చేసే భోజనం విటమిన్లతో కూడుకుని వుండేలా చూసుకోవాలి. ఒత్తిడి, తీవ్రమైన భావోద్వేగాలు కలుగకుండా సంయమనం పాటించ అలవాటు పడాలి. రాత్రిపూట శరీరానికి సరిపోయేంత నిద్ర వుండాలి. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ఏర్పాట్లు చేసుకోవాలి.
వాతావరణం ఎండగా వున్నప్పుడు, దాని నుండి రక్షణ పొందడానికి కావలసిన వాటిని ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తారు.
వృద్ధాప్యంలో శారీరక సమస్యలు రావడం సర్వసాధారణమే. ముందుగా చెప్పుకున్నట్టు రోగ నిరోధకశక్తి బలహీనపడడం వల్ల అనేక వ్యాధులు వస్తాయనుకున్నాం. ఆ సమయంలో మంచి వైద్యులకు చూపించుకుని చికిత్స చేయించుకోవాలి. ఒక్కో వ్యాధి వృద్ధులను బాధిస్తూ అనేక సంవత్సరాలు తక్కువ కాకుండా వుండే అవకాశం కూడా వుంటుంది. ఆ సమయంలో మనల్ని మనం రోగగ్రస్థులం అని చెప్పుకోకూడదని రోండాబెర్న్‌ రాసిన ‘ది సీక్రెట్‌’ అనే మనో వైజ్ఞానిక పుస్తకంలో డా||బెన్‌ జాన్సన్‌ వైద్యుడు, గొప్ప మనో వైజ్ఞానికుడు ‘మనం ఏదైనా జబ్బులో వున్నప్పుడు మన మాటల్లో ఆ జబ్బు విషయం గురించి పదేపదే చెప్పడం చేయకూడదు. అలా చేసినట్లయితే మనం ఆ జబ్బుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అయి, అది మనల్ని వదిలిపోదు. అందుకే ఆ సమయంలో మనం ఆ జబ్బు నుండి బయటపడిన భావన వ్యక్త పరుస్తూ వుండాలి అంటాడు. అంటే మనల్ని ఎవరైనా ఆరోగ్యం ఎలా వుంది అని అడిగితే బాగున్నాననో, ఆల్‌రైట్‌ అని అంటే, మనల్ని మనం అనారోగ్యాన్నుండి విముక్తి పొందినట్టు సానుకూల సంకేతం మన మెదడుకు చేరిపోయి మనం త్వరలో ఆరోగ్యవంతులమవుతాం అనే అర్ధం వస్తుంది.
అందుకే మనోవైజ్ఞానికులు ‘వృద్ధాప్యం గురించిన నమ్మకాలన్ని మన మనసులో వుండేవే. వాటిని మనం మనసులోంచి విడుదల చేయాలి’ అంటారు. అంటే ఎప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ వుండడం అంత మంచి విషయం కాదు అని వారి అభిప్రాయం. జబ్బుల గురించి వృద్ధాప్యం గురించి కొందరిచ్చే సందేశాలు వ్యతిరేకతను సృష్టిస్తాయి. కాబట్టి వాటిని మనసులోకి తీసుకోకూడదు. ఎప్పుడూ మన ఆలోచనలు సానుకూలతతో పయనిస్తుండాలి.
సైకాలజిస్టులు రోగగ్రస్థులను మందులు వాడకూడదని చెప్పడం కాదు, మందులతో ఆరోగ్యవంతులమవుతున్నాం అనే భావనతో వ్యవహరించమంటారు. అంటే మన పూర్వీకులు చెప్పిన మాటలు యద్భావం తత్భవతే. మన ఆలోచనలు ఎలా వుంటాయో అలాగే మనముంటాం అని అర్ధం కదా! ఆచార్య ఎన్‌.గోపి గారు వృద్ధాప్యాన్ని పరిణత దశ అనడంలో అర్ధం ఇదే!
ఆడ, మగ ఎంత వృద్ధులైనా ప్రతి విషయాన్ని సానుకూలంగా తీసుకోవాలి కానీ ప్రతికూలంగా ఆలోచించే అలవాటు పడకూడదు. ఎప్పుడూ మనలో సర్దుబాటుతనం వుండాలి.
పనిచేయలేని వృద్ధుల ఆలోచనలు ఎక్కువగా వుండడం వల్ల సుడిగుండాల వలె తయారై ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అందుకే ఏదైనా ఒక పనిలో నిమగం కావాలి. అవి ఆర్ధిక పరమైనవే కానవసరం లేదు. సమయాన్ని చక్కగా గడపడం కోసం మాత్రమే!
వృద్ధులకు ఆధ్యాత్మిక విషయాలు మంచి మెడిసన్‌గా చెబుతారు. అందులో రామాయణ భారత భాగవతాలు చదవడం నలుగురు సమవయస్కులు కలిసినప్పుడు దేవుడు, భక్తి విషయాలు చర్చించుకోవడం, తీర్థస్థలాల విషయాలు మాట్లాడుకోవడం వంటివి వీటికిందికే వస్తాయి. వీటినే సత్సంగాలు అంటారు.
కబీరుదాసు అనే ఆయన చదువులేని పేద ముస్లిం. ఆయనంటాడు… ”నా పేదరికం నన్ను విద్యకు దూరం చేయడంతో ప్రతిరోజు మహానుభావుల మధ్య కూర్చుని, వారి మాటల్ని శ్రద్ధతో వినేవాడిని. నేను రాయడం, చదవడం రాని జ్ఞానవంతుడ్ని అయ్యాను. సత్సంగం నన్ను తీర్చిదిద్దింది”.
కబీరుదాసు కొంతకాలం తరువాత గొప్పగా తయారై ఎందరికో గురువయ్యాడు. తన జ్ఞానాన్ని తన శిష్యులతో అక్షరబద్దం చేయించాడు. అదే కబీరువాణి. హిందీ భక్తి సాహిత్యంలో గొప్ప పుస్తకం అది.
కీ||శే|| భమిడిపాటి రామగోపాలం గొప్ప రచయిత. వృద్ధాప్యంలో ఆయన కష్టాల సుడిగుండంలో వున్నప్పటికి నవ్వుతూ, నవ్విస్తూ జీవించాడు. వృద్ధులకు ఆయన గొప్ప సందేశమిచ్చాడు. వృద్ధులు జీవితాన్ని జుర్రుకోవాలి తప్ప ఆలోచనా ప్రవాహంలో కొట్టుకుపోకూడదు.
వృద్ధాప్యం గురించి చైనా నవలాకారుడు ఝాంగ్‌ అనే ఆయన ‘ది స్కై గెట్స్‌ డార్క్‌, స్లోలీ’ అనే పేరుతో రాసిన నవలలో తన తండ్రి వృద్ధాప్యాన్ని చూసి గొప్పగా స్పందించిన విధానాన్ని వర్ణించాడంటూ శ్రీ కాళిదాసు పురుషోత్తంగారు శ్రీ సర్వోదయ కళాశాల, తెలుగు శాఖాధ్యక్షుడు, ప్రిన్సిపాల్‌ ఝాంగ్‌ రాసిన నవల గురించి చక్కగా వివరించారు. అందులోని కొన్ని ముఖ్యాంశాలు…
వృద్దాప్యం గురించి అందరికీ ఎరుకుండాలి. వృద్ధులు తమ సహచరినో, సహచరుణ్ణో కోల్పోయి ఒంటరిగా వున్న కుటుంబ సభ్యులతో సఖ్యతగా వుండాలి. వృద్ధులు ఎంత ఉన్నతోద్యోగులైనా రిటైరైన తరువాత ఎలాంటి గుర్తింపూ వుండదు. సమాజం కూడా వారిని పట్టించుకోదు. అయినా ఎవరినీ అసూయ, ద్వేషాలతో చూడకుండా తనవారు, పరాయివారు అని భేదభావం లేకుండా అందరితో ప్రేమగా వ్యవహరించాలి. ఎవరూ తననూ పట్టించుకోవడం లేదని వృద్ధులు బాధపడకుండా జీవిత చరమాంకం సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. వృద్దులు తమ జీవన ప్రయాణపు దారి రాళ్లు రప్పలతో, ముండ్లపొదలతో, ఎగుడు దిగుడుగా వుంటుంది. అయినా ఓపికతో కష్టమైనా ఇష్టపడి నడవాల్సిందే! వృద్ధులు ఎవరి గురించో కాకుండా తమ గురించి తాము బతుకుతుండాలి అనే ధ్యేయాన్ని మరువకూడదు అని చెప్పారు.
కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని వృద్ధులను ప్రేమ ఆప్యాయతలతో చూడాలి. సానుకూల మాటలతో పలుకరించ ప్రయత్నించాలి. ఛీత్కారాలు, అవహేళనలు లేకుండా గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. అవమానకరమైన ప్రవర్తనా రీతులతో వృద్ధుల మనసు గాయపడుతుంది. సాధ్యమైనంతవరకు ఉన్నంతలో ముసలివారిని సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలి.
ఇంట్లోని పెద్ద వయసువారు జీవిత ఒడుదొడుకులను అనుభవించిన వారు కాబట్టి నేటి యువతకు మార్గనిర్దేశం చేయగలరు. ఇలాంటి వారిని వృద్ధాశ్రమాలకు పంపడం ఏమంత మంచిపని కాదని యువతీ యువకులు భావించి, వారికి ఎలాంటి లోటు లేకుండా, రాకుండా చూసుకోవడం తమ బాధ్యతగా భావించడం మరవకూడదు.

– పరికిపండ్ల సారంగపాణి,
9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌,