– అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసిన పాత ఇండ్లు, మట్టి మిద్దెలు పడిపోయి ప్రాణహాని జరిగేందుకు అవకాశం ఉందని, అలాంటి ఇండ్ల నుండి ప్రజలను తక్షణమే కాళీ చేయించి సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై ఆదివారం ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల రహదారులపై నీరు ప్రవహిస్తున్న చోట రవాణా పునరుద్ధరణ చేయాలని,అలాగే విద్యుత్,తాగునీటి కి ఇబ్బందులు ఏర్పడినచోట తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచినట్లైతే వెంటనే నీటిని బయటకు పంపించాలని ఆదేదించారు.వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకూడదన్నారు. ప్రజల అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం కేతేపల్లి మండలంలో 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని, కొన్ని మండలాలలో 150, 140 మిల్లీమీటర్లు వర్షం నమోదయిందని, జిల్లావ్యాప్తంగా సరాసరిన 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. ఆదివారం, అలాగే సోమవారం ఇంకా భారీ, అతి భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు వారి వారి ప్రాంతాలలో తిరిగి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఎక్కడ నీరు నిల్వ ఉండవద్దని, డ్రైన్లు, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు.విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరయం లేకుండా చూడాలని, ట్రాన్స్పోర్టు అధికారులు గ్రామాలకు రవాణా సౌకర్యాలు చూసుకోవాలని, తాగు నీటి శాఖ తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలను గుర్తించి అరికట్టాలని, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు ఎప్పటికప్పుడు రహదారులను గమనిస్తూ ఓవర్ ఫ్లో అయ్యి ప్రవహించే కాజు వేలు, కల్వర్టుల దగ్గర ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ,ప్రజలు వాటిని దాటే సాహసం చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అక్కడే నిలువరించాలని, వరద ప్రవాహం తగ్గిన తర్వాతే వెళ్లేలా చూడాలని చెప్పారు.
వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం జరగకుండా రైతులను అప్రమత్తం చేయాలని,ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ,మూసి ప్రాజెక్టు గేట్లు తీసినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ఆయా గ్రామాలలో టామ్ టామ్ వేయించాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకల్లో ఎట్టి పరిస్థితులలో మనుషులు, పశువులు దిగవద్దని ,ఈతకు వెళ్ళవద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లకూడదని ,అలాగే యువత సెల్ఫీలు దిగేందుకు నీటి పరివాహక ప్రాంతాల చెంతకు అసలు వెళ్ళవద్దని కోరారు. పాతబడ్డ పాఠశాలలు,హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వార్డెన్లు వారి వారి హాస్టల్లాలోనే ఉండి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ప్రత్యేకించి తాగునీరు,ఆహారం కలుషితం కాకుండా చూడాలని సూచించారు.చెరువులు, కుంటలు తెగిపోయేందుకు,బుంగలు పడేందుకు ఆస్కారం ఉన్నచోట లస్కర్ల ద్వారా ముందే గుర్తించి పటిష్టం చేయాలని,ఒక వేళ ఎక్కడైనా తెగిపోతే కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.అన్ని గ్రామాలకు తాగు నీరు,రవాణా,విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జిల్లా లోని రహదారుల పై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని, అంతేకాక సహాయక, పునరావాస చరీస్లలో పోలీసు యంత్రాంగం సహకారం ఉంటుందని తెలిపారు.అదనపు కలెక్టర్లు టి.పూర్ణ చంద్ర,జె.శ్రీనివాస్,పి ఆర్ ఆర్ అండ్ బి,ట్రాన్స్కో ఎస్ ఈ లు,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,విద్య,పంచాయతీ,మున్సిపల్ శాఖల అధికారులు, ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు,ఎంపిడివోలు,తహశీల్దార్లు మాట్లాడారు.