– టీఎస్సీపీఎస్ యూనియన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి ఈడిగి నరేష్‌గౌడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఓపీఎస్ సంకల్ప రథయాత్ర జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో మొదలై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా, రెవెన్యూ కేంద్రాల్లో ఈనెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముగుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్, ట్రెసా, జ్యుడీషియరీ, వ్యవసాయ, నీటిపారుదల, వైద్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్, టీఎస్టీయూ, టీపీయూఎస్తోపాటు ఇతర ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘాలు, అన్ని శాఖల ఉద్యోగ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులే కాకుండా ఓపీఎస్‌లో ఉన్న ఉద్యోగులూ ఈ యాత్రకు మద్దతు ప్రకటించారని తెలిపారు. గత రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను అభద్రతాభావానికి గురి చేస్తున్న ఈ సీపీఎస్ అటు ప్రభుత్వానికి, ఇటు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టపరిచే విధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే దేశంలో ఆరు రాష్ట్రాల్లో ఈ విధానం పట్ల సమీక్షలు చేసి కమిటీలు వేసి సీపీఎస్‌ను సంపూర్ణంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని గుర్తు చేశారు. ఈ విధానం కేవలం కార్పొరేట్లకు ఆర్థిక పరిపుష్టి కలిగించేలా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము దాదాపు రూ.ఎనిమిది వేల కోట్లు ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ సొమ్ము పీఎఫ్ఆర్డీఏ ద్వారా ఎన్ఎస్డీఎల్ జాబితా కంపెనీల్లో పెట్టుబడులుగా షేర్ మార్కెట్లో ఉన్నాయని వివరించారు. ఈ విధానం రద్దు వల్ల అటు ప్రభుత్వానికి, రాష్ట్రంలోని 1.72 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు, వారికి సామాజిక భద్రత చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.