– గజ్వేల్ ఇంద్ర పార్క్ చౌరస్తా వద్ద ఘటన
నవతెలంగాణ-గజ్వేల్ రూరల్
ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల నిండు ప్రాణం బలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పట్టణంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన చామంతి బుచ్చవ్వ(60) కొంతకాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతుండగా.. ఆస్పత్రిలో చూపించుకునేందుకు గజ్వేల్‌కు వచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్లను సంప్రదించి తిరిగి తన గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుంది. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. వృద్ధురాలిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతురాలి కాళ్లు నుజ్జునుజ్జయింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన గజ్వేల్ సీఐ బి. సైదా పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుచ్చవ్వ మతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కొడుకు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.