ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఓలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఓలి ప్రమాణ స్వీకారం అనంతరం 30 రోజులలోపు పార్లమెంటులో తన బలాన్ని నిరూపించాల్సి వుంది. 275 సీట్లు కలిగిన పార్లమెంట్ ప్రతినిధుల సభలో ఓలి విశ్వాసపరీక్షలో నెగ్గాలంటే కనీసం 138 ఓట్లు కావాల్సి వుంది. శుక్రవారం ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షల్లో ఓడిపోయిన ప్రచండ స్థానంలో ఓలి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పడమే కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా వుంది.