– దిగ్గజ షుటర్‌కు ఐఓసీ గౌరవం
పారిస్: భారత స్పోర్ట్స్ దిగ్గజం, షుటింగ్ ఐకాన్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘ఒలింపిక్ ఆర్డర్’ పురస్కారం ప్రకటించింది. ఒలింపిక్ మూమెంట్‌లో విశేష సేవలు అందించినందుకు అభినవ్ బింద్రాకు ఐఓఏ ఈ పురస్కారం అందించనుంది. ఆగస్టు 10న పారిస్‌లో జరిగే 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌లో బింద్రాకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆగస్టు 11న పారిస్ ఒలింపిక్స్ ముగియనుండగా.. ఓ రోజు ముందు ఈ పురస్కార ప్రదాన వేడుక జరుగనుంది. ‘ఒలింపిక్ మూమెంట్‌కు మీరు (అభినవ్ బింద్రా) చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఒలింపిక్ ఆర్డర్ పురస్కారాన్ని మీకు ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని తెలియజేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అని అభినవ్ బింద్రాకు రాసిన లేఖలో ఐఓసీ అధ్యక్షుడు అన్నారు. ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అందుకోనున్న అభినవ్ బింద్రాకు భారత క్రీడాశాఖ మంత్రి మాండివీయ, క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.