ముంబయి : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీకి సవాలు విసిరారు. ముంబయిలో ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2024లో జమ్ము కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో అభివృద్ధి, శాంతి స్థాపనకు కృషి చేశామని బీజేపీ చెప్పుకోవటాన్ని తప్పు పట్టారు. కేంద్ర ఎన్నికల సంఘంతో కాకుండా సుప్రీం కోర్టుతో జమ్మూకాశ్మీర్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పించడమేమిటని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నిల్లో తమ పార్టీ జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.2019 తర్వాత ఐదేండ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటని అన్నారు. 2024లో జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని, తాము బీజేపీతో పోరాడతామని అన్నారు. జమ్ముకాశ్మీర్ ప్రజల హక్కులు, భూములతో పాటు కాశ్మీర్‌ను యథాస్థితికి తీసుకురావడానికి పోరాడతామని అన్నారు. 2019 తర్వాత కాశ్మీర్‌లో శాంతి స్థాపన జరిగినపుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.