16న సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలి

On 16th, strike rural bandh should be defeated– వామపక్ష పార్టీల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన కార్మిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపుని చ్చాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ – మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల వేదిక సంయక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సంయుక్తంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయని తెలిపాయి. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), కె సాంబశివరావు (సీపీఐ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా), చలపతిరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), సాదినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), సిహెచ్‌ మురహరి (ఎస్‌యూసీఐసీ), జానకి రాములు (ఆరెస్పీ), బి సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్‌), ఎం రమేష్‌రాజా (సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌), ప్రసాదన్న (సీపీఐఎంఎల్‌) సంయుక్తంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి ఇప్పటికే రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం రైతుల ప్రదర్శన మీద తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ఫ్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న వాగ్ధానాన్ని గాలికి వదిలేసిందని తెలిపారు. రైతాంగం కోరుతున్న కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంలో హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 200 రోజులు పని కల్పించేలా ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తోందని తెలిపారు. కార్మిక చట్టాలను బలహీనం చేసే నాలుగు రకాల లేబర్‌ కోడ్‌లను సిద్ధం చేసి కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా ఎదుర్కోలేక రామాలయం ప్రారంభోత్సవాన్ని ముందుకు తెచ్చి హిందూత్వ రాజకీయాలతో ఓటు బ్యాంకు పెంచుకుని తిరిగి గద్దె నెక్కడానికి సిద్ధమవుతున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తలపెట్టిన సమ్మెను, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. వామపక్ష శ్రేణులు ఈ ఆందోళనలో క్రియాశీలంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.