ఆన్‌ (ఏ) లైన్‌

అంతరంగం అంతర్జాలపు వేదిక మీద ముఖచిత్రం గీసుకుంటుంది
మూకుమ్మడి దాడికి ముసుగుదొంగల మూడో కన్ను
ఎవరి రంగులు వారివి కావు
ఎవరికి వాళ్ళు కాసింత దూరంగా నెట్టివేయబడ్డవారే
ఇదో సంకల్పిత సప్తవర్ణాల చిత్రం
పగలు రేయి కలానికే తప్ప నడిచే మనిషికి సంబంధమే లేదు
ఓ దుఃఖాన్ని మోస్తున్నప్పుడు మారే డిస్‌ప్లే పిక్చర్‌లా
ఏ గడ్డకట్టిన నదులను దాటినప్పుడల్లా మార్చుకునే స్టేటస్‌లా
మాటిమాటికి మారే ఓ భావ ప్రకంపనల ప్రవాహంలో
చిల్లు పడ్డ పడవలో ప్రయాణిస్తూ ఉంటావ్‌
వ్యక్తిత్వానికి వేలం వేస్తూ వేళ్ళకొనల్లో వల్లకాడు
వసంతాలను వెతుక్కుంటున్న కోకిలలా అక్కడక్కడ వాలిపోతూ
వారానికే ఓ విలాపగీతాన్ని శిశిరంలా వెంటబెట్టుకువస్తుంది
ఒకరిని ఒకరు దోచుకోవడమో, నిందించుకోవడమో
నాగరికతకున్న అనాగరికపు లక్షణం
నిన్ను నువ్వు అవాస్తవంగానో, అవసరానికి తగ్గట్టు ఆవిష్కరించుకుంటావ్‌
ఇప్పుడు బ్రతుకులన్నీ ఆన్‌ ‘లైన్‌’
అలవాటుపడ్డ నీ జీవితాన్ని తదేకంగా చూస్తూ ఓ తరం
తనని తాను అనునయించుకుంటుంది
నిస్తేజం నీ కళ్ళకు పొరలను అల్లి
అప్‌డేటెడ్‌ వర్షన్‌ ఇన్‌ స్టాల్‌మెంట్‌ నెత్తి మీద డేటా బటన్‌ నొక్కుతుంది
ఓకానొక రోజు నువ్వంతా ఖాళి అయ్యాక ఓ బహిరంగ ప్రకటన
గుట్టురట్టు
సైబర్‌ నేరగాళ్ళ చేతిలో సంకల్పితంగా మోసపోయినా ఓ వ్యక్తి
మసకగా సన్నని అక్షరాల సమూహాంలో ఇలా రాయబడి ఉంటుంది
నిన్ను నువ్వు బహిరంగ ప్రకటించుకోవడానికి
జీవితం ఏమీ వేలం పాట కాదు కాసింతనై రహస్యంగా బ్రతకాలి
– పి.సుష్మ, 9959705519