యాసంగి పంటలపై

మంత్రివర్గ ఉపసంఘం భేటీనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యాసంగి పంటల సాగును ముందుకు జరిపేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జరిగింది. దీనికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం పూర్తిగా మారిపోయిందనీ, సాగు నీరు, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో రైతులో ఆత్మస్థైర్యం పెరిగిందని అభిప్రాయపడ్డారు. కానీ యాసంగి వరి పంట కోతల ఆలస్యం కారణంగా అకాల వర్షాలతో రైతులతో పాటు ప్రభుత్వానికీ నష్టం జరుగుతుందని చెప్పారు. దీని నివారణకు యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారుల్ని కోరింది. యాసంగి సాగులో యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగు తదితర అంశాలపై చర్చించారు. దీనిపై శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోసారి సమావేశమై మరింత లోతైన అధ్యయనం చేసి, సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.