మాజీ ఐజీ ప్రభాకర్‌రావును తీసుకురావటంపై

– సీనియర్‌ పోలీసు అధికారుల మల్లగుల్లాలు
– యూఎస్‌కు స్పెషల్‌ టీమ్‌ పంపే విషయమై సీరియస్‌గా యోచన
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్‌రావును అమెరికా నుంచి తీసుకురావటంపై పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఒకటో నిందితుడిగా పేర్కొనబడిన ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావుతో పాటు మరో నిందితుడైన ఐ న్యూస్‌ సీఈఓ శ్రవణ్‌కుమార్‌ సైతం అమెరికాలోని ఉన్నట్టు అంచనా ఉన్నప్పటికీ.. నిజానికి ఆయన ఎక్కడున్నాడనే విషయమై అధికారులకు స్పష్టమైన సమాచారమేదీ లేదు. అయితే, ఈ కేసు వెలుగులోకి వచ్చిన దాదాపు వారం ముందు అమెరికాకు వెళ్లిపోయిన ప్రభాకర్‌రావు కోసం కోర్టు అనుమతితో మొదట లుకౌట్‌ నోటీసును దర్యాప్తు అధికారులు జారీ చేశారు. అనంతరం ఆయనతో పాటు శ్రవణ్‌కుమార్‌లు దేశం దాటి వెళ్లినట్టు రూఢ కావటంతో తిరిగి కోర్టు అనుమతితోనే రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రెడ్‌కార్నర్‌ నోటీసును అంతర్జాతీయంగా అమలు చేసే అధికారం ఇంటర్‌పోల్‌కు ఉండటంతో ఆ విభాగానికి రాష్ట్ర సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి, సీబీఐ నుంచి ఇంటర్‌పోల్‌కు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ సాగుతున్న దశలోనే తాను అమెరికాలో ఉన్నాననీ, అక్కడ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నాననీ, అది పూర్తి కాగానే భారత్‌కు వస్తానంటూ ప్రభాకర్‌రావు నేరుగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్న వెంకటగిరికి లేఖ రాశారు. తర్వాత తాను వర్చువల్‌గా విచారణకు హాజరవుతానంటూ కూడా సమాచారాన్ని పంపించాడు. ఈ సమాచారాన్ని నాంపల్లి కోర్టుకు అందజేశారు. ప్రభాకర్‌రావు విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయమూర్తి.. నిందితుడిని కోర్టులో హాజరుపర్చాలంటూ దర్యాప్తు అధికారులను ఆదేశించారు. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఒకపక్క న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరోపక్క, అమెరికా నుంచి ప్రభాకర్‌రావును ఏ విధంగా తీసుకురావాలనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెడ్‌కార్నర్‌ నోటీసును కూడా జారీ చేశామనీ, ఆ విషయమై ఇంటర్‌పోల్‌ ద్వారా నిందితుడికి సమాచారమిచ్చి తీసుకువచ్చే ప్రక్రియ కూడా సాగుతున్నదని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రక్రియ అమలులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను విశ్లేషించి త్వరగా అమలు చేసేలా సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌పై ఒత్తిడి తీసుకురావటం ఒక మార్గమనీ, లేదా ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక టీమ్‌ను అమెరికాకు పంపించి ప్రభాకర్‌రావును తీసుకొచ్చే విషయమై అడుగు వేయటం ఇంకో మార్గమని కూడా ఉన్నతాధికారులు సీరియస్‌గా యోచిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండ్రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర హౌం శాఖకు సమాచారాన్నందించి తదుపరి చర్యకు దిగాలని సీనియర్‌ పోలీస్‌ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.