వరద బాధిత ప్రాంతాల్లో నష్టం అంచనాపై

వరద బాధిత ప్రాంతాల్లో నష్టం అంచనాపై– కేంద్రానికి పూర్తి నివేదికందిస్తాం
– కేంద్ర విపత్తు నిర్వహణా బృందం
– తొగరాయి గ్రామంలో రోడ్లు, కూలిన ఇండ్లు పరిశీలన
నవతెలంగాణ-కోదాడరూరల్‌
వరదల వల్ల నష్టపోయిన ప్రాంతా ల్లో నష్టం అంచనాపై పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను బుధవారం కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం ఏ.ప్రదీప్‌ కుమార్‌ నేతృత్వంలో పరిశీలించింది. కోదాడ మండల పరిధిలోని తొగరాయి గ్రామంలో వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను, కూలిపోయిన ఇండ్లను పరిశీలించింది. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ వారికి వివరించారు. వరదలతో పంట నష్టం సంభవించిందని, వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం గురించి రోడ్లు, ఇరిగేషన్‌ ట్యాంకులు, నీట మునిగిన గృహాలు, పశువుల మృత్యువాత, ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో వరదల వల్ల ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని అలాగే రైతులకు అనుబంధ శాఖలైన ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్ల నుంచి సమాచారం సేకరించి.. నష్టంపై అంచనా వేశారు. పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని జరిగిన నష్టానికి ఎంత పరిహారం అవసరమో నివేదిస్తామని బృంద సభ్యులు తెలిపారు. నిపుణుల బృందంలో మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పవన్‌ స్వరూప్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ శివ చిదంబరం, చీఫ్‌ సైంటిస్ట్‌ అజరు చౌరస్య, ఈఎన్సీ ఇరిగేషన్‌ కె.విజయకుమార్‌, పంచాయతీరాజ్‌ షేక్‌ ఇమామ్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎస్‌ఎం సుభాని, అర్బన్‌ సెక్టార్‌ రచన, సభ్యులు శాఖల వారీగా కోదాడలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, ఆర్టీవో సూర్యనారాయణ, ఇరిగేషన్‌ డీఈ రామకిషోర్‌, ఆర్‌అండ్‌బీ డి.పవన్‌ తదితరులు పాల్గొన్నారు.