ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె,గ్రామీణ బంద్‌

– కార్పొరేట్‌, మతతత్వ విధానాలను తిప్పికొట్టాలి
– కేంద్ర, రాష్ట్ర, కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతతత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతిఒక్కరూ పూనుకోవాలనీ, ఫిబ్రవరి 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె, గ్రామీణబంద్‌ను జయప్రదం చేయడంలో భాగంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను లక్షలాది కుటుంబాలకు చేరేలా ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. జనవరి 26న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలసి జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, మోటర్‌ బైక్‌ ర్యాలీలు నిర్వహించాలనీ, జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఐక్య సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాయింట్‌ ప్లాట్‌ ఫారమ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూటీయూసీ), వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దీనికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ యూసుఫ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయకుమార్‌ యాదవ్‌, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, కె. నర్సయ్య, అంజాద్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబు యాదవ్‌, పి. నారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింహా, శ్రామిక మహిళా నాయకులు ఎస్వీ. రమ, అరుణక్క, అనురాధ, కరుణ కుమారి, తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా రైతులు, కార్మికులు, శ్రామిక మహిళలు, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మరుగు పరుస్తోందని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్న తీరును వివరించారు. 50 ఏండ్ల గరిష్టానికి నిరుద్యోగం చేరిందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ అటకెక్కిందన్నారు. శ్రామికుల నిజవేతనాలు 20 శాతం తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. సమ్మె హక్కును కాలరాసిందనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, వెల్ఫేర్‌బోర్డులను నిర్వీర్యం చేస్తున్నదని వివరించారు. 12 గంటల పనివిధానాన్ని అమల్లోకి తెచ్చిందనీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, అవర్లీబేస్డ్‌ పనిపద్ధతులను తీసుకొచ్చి కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్నదని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేందుకు అస్సలు అంగీకరించడం లేదన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడానికి నిరాకరిస్తోందన్నారు. వీటన్నింటినీ దాచిపెట్టి ఆకట్టుకునే నినాదాలు, భావోద్వేగ ప్రసంగాలతో మోడీ సర్కారు ప్రజలను మోసగిస్తోందన్నారు. దీనివల్ల దేశానికి జరుగుతున్న నష్టాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు వందన సమర్పణ చేశారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. చంద్రశేఖర్‌, ఎం. వెంకటేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కాసు మాధవి, ఎ. సునీత, పి. సుధాకర్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు శివబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటేష్‌లు పాల్గొన్నారు.