అలల పోరు లాంటి
కలవరపు మనసు
సెలయేరు అయిపోయింది.
సంక్రాంతి అమ్మ పైట చాటుకు
చేర్చినందుకేమో!..
భానుడు, చంద్రుడు
చారు బ్రేక్ తీసుకున్న సమయం.
పతంగులు,
వాటిని పరిగెత్తిస్తున్న పిల్లల కేరింతలకు
కోరస్ పాడుతున్నాయి,
ఎగురవేయలేని
ఆ అమాయకత్వానికి నవ్వుకుంటూ!…
కుల, మత వివక్షని
హేళన చేస్తూ, ఐకమత్యంగా
గూళ్ళకు చేరుతున్న పక్షి బందం.
తిడుతూనో, గొడవ పడుతూనో
వీలైనంత సమయం నాన్నతోనే గడిపే అమ్మ,
ఆయన రాక కోసం వేయికళ్లతో
వీధి గుమ్మం వైపు చూస్తుంది.
ఏంటో ఆడవారికి భర్తే ప్రపంచం.
ప్రపంచాన్ని
నాన్న లాగే అమ్మ కూడా చదివుంటే
నాకు మరింత ధైర్యం వచ్చేదేమో కదా?!…..
పెరటిలోని మొక్కలన్ని
కుశల ప్రశ్నలు వేస్తున్నాయి..
కొత్తగా పూచిన వాటి పిల్లలను
పరిచయం చేస్తూ….
సాధారణంగా అనిపించే
అద్భుతమైన సాయంత్రం.
ప్రత్యక్ష సాక్షిగా పరవశిస్తున్న మనసు
చిరునవ్వులు విదజల్లింది…
– కొండేటి తేజస్వి