15న ‘సీతారామ’కు శ్రీకారం

– సీఎం రేవంత్‌ హాజరు
– రెండో పంపు వద్ద ప్రారంభోత్సవం
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్‌ను ఈ నెల 15న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి యన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై జలసౌధలో ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, నాగేందర్‌ రావు, డిప్యూటీ ఈఎన్నీ కె. శ్రీనివాస్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆ రోజు ఉదయం రాష్ట్ర రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం హెలికాప్టర్‌ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరాకు ముఖ్యమంత్రి చేరుకుంటారని మంత్రి తెలిపారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని చెప్పారు. ప్రాజెక్ట్‌ రెండో పంప్‌హౌజ్‌ నుంచి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. మొత్తం ఈ కార్యక్రమ పర్యవేక్షణకు గాను ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఆనవాయితీగా ఏర్పాటు చేసే తేనీటి విందులో సీఎం పాల్గొంటారని వివరించారు.