21న మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా జయప్రదం చేయండి

– సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెలిశాల కృష్ణమాచారి
నవతెలంగాణ-సిర్పూర్‌(టి)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి విస్మరించిందని నిరసిస్తూ ఈ నెం 21 చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెలిశాల కృష్ణమాచారి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ మండల కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహాణను హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, పెండింగ్‌ వేతనాలు, బిల్లులు, చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించాలన్నారు. అన్ని మండల కేంద్రాలలోని విద్యాశాఖ కార్యాలయాల్లో కార్మికుల అనేక సమస్యలపైన ఆగస్టు 13,న ధర్నాలు నిర్వహించి విజయవంతం చేయాలని అదేవిదంగా ఆగస్టు 21న హైదారాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ మండల కమిటి నాయకులు దుర్గం లక్ష్మీ, గాజిరెడ్డి బుజ్జీ, గాజిరెడ్డి నాగుబాయి, గాజిరెడ్డి సంధ్యా పాల్గొన్నారు.