కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా..

– ఉత్సాహపూరితంగా ట్రై క్రీడా వేడుకలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్‌) ఆధ్వర్యంలో ‘తెలంగాణ ట్రై క్రీడా వేడుకల’ను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్‌ నీరాకేఫ్‌ వద్ద సైక్లింగ్‌ పోటీలను శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు సాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయగౌడ్‌ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో వయసుతో సంబంధం లేకుండా సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు కార్పొరేషన్ల చైర్మెన్లు సరదాగా సైకిల్‌ పై సవారీ చేసిి ఆకట్టుకున్నారు. వీటితో పాటు ఇందిరాపార్క్‌లోని వెలోడ్రమ్‌లో స్కేటింగ్‌ పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు వందల సంఖ్యలో యువ స్కేటర్లతో పాటు వారి తల్లిదండ్రులు రావడంతో ఆయా పరిసరాల్లో సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున క్రీడా పోటీలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దశాబ్ద కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన వారికి విలువైన ఇండ్ల స్థలాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. క్రీడాభివృద్ధిలో మంత్రి కేటీఆర్‌ సహకారం, ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. మరోవైపు యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియంలో రెజ్లింగ్‌ పోటీలను సాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయగౌడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సాట్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సైక్లింగ్‌, స్కేటింగ్‌, రెజ్లింగ్‌ పోటీలకు ఆటగాళ్ల నుంచి భారీ స్పందన వస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల చైర్మెన్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, సాట్స్‌ అధికారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.