– రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి
నవతెలంగాణ నార్సింగి
మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని జాతీయ రహదారి 44 మరోసారి రక్తసిక్తమయింది. ఎలాంటి సూచికలు లేకుండా మరమ్మతు కోసం నిలిపిన లారీని అతివేగంగా వచ్చిన కారు ఢ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహీమూద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్ మండలం నార్లాపుర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పెంటపర్తీ బాబురెడ్డి(62) ఆదివారం సాయంత్రం జరగబోయే తన కొడుకు వివాహ రిసెప్షన్ ఏర్పాట్లకు అతని బంధువులు, ఉపాధ్యాయులు దోమకొండ మండలం అంబర్‌పేట్ గ్రామానికి చెందిన సరికొండ లింగారెడ్డి(50), సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల వెంకటరమణ రెడ్డి (56)ని వెంట తీసుకుని తన కారులో చేగుంట నుంచి రామాయంపేటకు బయలుదేరారు. రాజస్థాన్‌కు చెందిన లారీ కోడూరు నుంచి బొప్పాయి పండ్లను నింపుకుని ఢిల్లీకి బయలుదేరగా.. మార్గమధ్యలో మండలంలోని జప్తీ శినూర్ వద్ద జాతీయ రహదారి-44పై చెడిపోయిపోవడంతో మరమ్మతు కోసం ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకుండా రోడ్డుపైనే నిలిపారు. మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో అతివేగంగా తన కారును నడిపిస్తున్న బాబురెడ్డి నిలిపి ఉంచిన లారీని గమనించక వెనుక వైపు నుంచి ఢ కొట్టాడు. దాంతో కారు.. లారీ వెనుక వైపు కిందకు చొచ్చుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద తీవ్రత వల్ల ముత్యాల వెంకటరమణారెడ్డి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న లింగారెడ్డి, తీవ్రంగా గాయపడిన బాబురెడ్డిను వెంటనే అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లింగారెడ్డి ఆస్పత్రిలో ప్రాణాలు వదిలాడు. బాబురెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అహ్మద్ మోహీయూద్దీన్ తెలిపారు.