– గాజాపై మళ్లీ దాడి
– 109 మంది పాలస్తీనియన్ల మృతి..
– పలువురికి గాయాలు పదుల సంఖ్యలో పౌరులు అదృశ్యం
– ఖండించిన ప్రపంచ దేశాలు
గాజా : గాజాపై ఇజ్రాయెల్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించింది. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఒక ఐదోంతస్తుల భవనంపై ఎయిర్‌స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ ఘటనలో 109 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరోపక్క, శిథిలాల కింద చిక్కుకుని పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది. దిక్కుతోచని పరిస్థితిలో పదుల సంఖ్యలో ప్రజలు అదృశ్యమయ్యారు. దీంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులేనని పాలస్తీనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయిల్ తన యుద్ధ పైత్యాన్ని కొనసాగిస్తున్నది. దాడులతో అమాయకులైన పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకుంటున్నది. ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 43,061 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1,01,223 మంది గాయాలపాలయ్యారు.. ఇక ఇజ్రాయిల్ దాడులతో లెబనాన్‌లో 2710 మంది చనిపోగా, వీరిలో 127 మంది చిన్నారులున్నారు. అలాగే, 12,592 మంది గాయాలపాలయ్యారు.
ఇజ్రాయిల్ చర్య ‘సహించరానిది’.. ఖండించిన పలు దేశాలు
‘యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్కర్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (యూఎన్ ఆర్‌డబ్ల్యూఏ)’ ను నిషేధిస్తూ ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణ యాన్ని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)తో పాటు ప్రపంచ దేశాలూ ఖండించాయి. ఇజ్రా యిల్ చర్య ‘సహించరానిది’, ‘ప్రమాదకరమైన దృష్టాంతం’ అని తప్పుబట్టాయి. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ను ఉగ్రవాద బృందంగా పేర్కొనటంతో పాటు తమ స్వంత గడ్డపై ఆ సంస్థ మానవతా చర్యలు చేపట్ట కుండా నిషేధించే రెండు చట్టాలను ఇజ్రాయిల్ పార్ల మెంట్ సోమవారం ఆమోదిం చింది. ఈ చట్టాలు గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లకు ప్రాణాలను రక్షించే సహాయాన్ని అందించకుండా యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏను అడ్డుకుంటుంది. ఇజ్రాయిల్ చర్యను ఖండించిన, తప్పుబట్టిన వాటిలో యూఎన్‌ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లతో పాటు పాలస్తీనా, చైనా, రష్యా, బ్రిటన్, జోర్డాన్, ఐర్లాండ్, నార్వే, స్లొవేనియా, స్పెయిన్ సహా పలు దేశాలు ఉన్నాయి. యూఎన్‌నార్‌డబ్ల్యూఏ చర్యలు ఆవశ్యకమని యూఎన్‌ఓ స్పష్టం చేసింది. ఈ సంస్థకు ప్రత్యామ్నాయం లేదని యూఎన్‌ఓ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ఇజ్రాయిల్ చట్టాన్ని తిరస్కరించిన పాలస్తీనా.. దానిని తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ చర్యను ‘దౌర్జన్యం’గా చైనా రాయబారి ఫు కాంగ్ అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ చర్య భయంకరమైనదనీ, ఇది గాజాలో పరిస్థితిని మరింత దిగజార్చుతుందని రష్యా యూఎన్‌ఓ రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఇజ్రాయిల్ చట్టం యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ చర్యలను అసాధ్యం చేసే ప్రమాదమున్నదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. దీనిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయం వినాశకర పరిణామాలను కలిగిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అధనామ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ చర్య సహించరానిదనీ, ఇజ్రాయిల్ బాధ్యతలు, విధి విధానాలను ఉల్లంఘిస్తుందని వివరించారు.