– రూ.19,370 కోట్ల రుణం కోసం కేరళ అభ్యర్థనను తోసిపుచ్చిన కేంద్రం
– చర్చల సారాంశాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేస్తాం : కేరళ సర్కార్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాలడ్డింది. రుణం కోసం కేరళ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో జరిపిన చర్చల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.19,370 కోట్ల రుణం తీసుకోవాలన్న కేరళ ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిందని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వేణు తెలిపారు. మరోసారి సమావేశమై ఆ రాష్ట్ర ఆర్థిక బకాయిల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేరళ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని అధికారులు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ కేరళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
”రాష్ట్రానికి దాని రుణ పరిమితిలో అర్హత ఉన్నా ఉపయోగించని ఆర్థిక అంశాల గురించి మేము కేంద్రానికి, సుప్రీంకోర్టుకు తెలియజేశాము. మేము కేంద్రంతో జరిపిన చర్చల్లో సాధ్యమైన తాత్కాలిక ఏర్పాటు కోసం ప్రయత్నించాము. కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. రూ.13,608 కోట్ల కంటే అదనంగా రూ.19,370 కోట్లు ఇవ్వాలన్న మా అభ్యర్థనను వారు అంగీకరించలేదు” అని వేణు అన్నారు. కేరళ తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లి కేంద్రంతో చర్చల స్థితిగతులను తెలియజేస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ”మేము కోర్టు నుండి తీర్పు పొందడానికి ప్రయత్నిస్తాము” అని ఆయన అన్నారు.రాష్ట్రం అంగీకరించిన రూ.13,608 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి ప్రస్తుతం అనుమతిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలు జరపాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అదనంగా రుణాలు తీసుకోవడానికి కేరళ దాఖలు చేసిన దావా ఉపసంహరణను ముందస్తు షరతుగా పెట్టవద్దని కేంద్రానికి తెలిపింది.