మరోసారి రైతులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం

మరోసారి రైతులను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం– విద్యకు 9వేల కోట్ల రూపాయలు కోత సిగ్గు చేటు
– వ్యవసాయరంగంకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు పెంచాలి
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్‌
2024-25 సంవత్సరానికి పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ రైతులను, వ్యవసాయరంగాన్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఉందని, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని రైతు వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్‌ను సవరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వ్యవసాయరంగం, ఎరువులు సబ్సిడీ, ఫసల్‌ బీమా, ఉపాధి హామీ పథకం నిధులు తగ్గింపు నిరసిస్తూ బుధవారం తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో వైరాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు ఈ బడ్జెట్‌ పూనుకోలేదని, పైగా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోత పెట్టేందుకు పూనుకున్నదని, 14 వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను పెంచామని ఆర్థిక మంత్రి గారు ప్రకటించారని కానీ, స్వామినాథన్‌ కమీటి సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, కొనుగోలుకు చట్టబద్దత కల్పించాలని, కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో సగం మందికి పైగా ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయరంగానికి నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధం కావడం లేదన్నారు. రుణమాఫీ ప్రస్తావనే తీసుకురాలేదని, సహకార రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని, ఆహార సబ్సిడీగానీ, వడ్డీమాఫీ పథకానికి గానీ, వ్యవసాయ పరిశోధనలకు గానీ, పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా కూడా నిధులు పెంచలేదని, వడ్డీ మాఫీ పథకానికి 2022-23 సంవత్సరంలో రూ.23,000ల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.22,600 కోట్లు మాత్రమే కేటాయించిందని, పంటల బీమా పథకంలో కూడా నిధులు కోత పెట్టారని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని బీమా కంపెనీలకు కాకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలన్న రైతుల డిమాండ్‌ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని రైతులకు పెన్షన్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా నెరవేర్చలేదన్నారు. ఉపాధిహామీ పథకానికి కోతలు పెట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేసేందుకు పూనుకోలేదని, సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు, రంగారెడ్డితో సహా ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వలేదన్నారు. విద్యకు 9000 కోట్ల రూపాయలు తగ్గింపు విద్య నాణ్యతపై ప్రభావం చూపి పేద, మధ్యతరగతి వర్గాల పిల్లల భవిష్యత్తు, ఉపాధిలో తీవ్రంగా నష్టం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బిజెపి పార్లమెంట్‌ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాంబాబు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్‌, తోట నాగేశ్వరరావు, వ్యకాస పట్టణ కార్యదర్శి గుమ్మా నరిసింహరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, మల్లెంపాటి ప్రసాదరావు, రుద్రాక్షల నరసింహాచారి, సిఐటియు మండల కన్వీనర్‌ బాజోజు రమణ, రైతు సంఘం నాయకులు హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి కృష్ణమూర్తి, సత్యనారాయణ, యనమద్ది రామకృష్ణ, వడ్లమూడి మధు, ఎస్‌కె నాగుల్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.