వచ్చే సంవత్సరం తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాక పోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలు తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫాం మీద పెట్టిన ఒక పోస్టులో వివరించాడు. 2024లో తాను అధ్యక్షుడిగా ఎన్నికవుతాననే ఆశతో మాత్రమే స్టాక్ మార్కెట్ ఉచ్చ స్థితిలో ఉందని ట్రంప్ రాశాడు. తాను మళ్ళీ గెలవకపోతే 1929లో వచ్చిన మహామాంద్యంలో కన్నా దారుణంగా స్టాక్ మార్కెట్ పతనమౌతుందని ట్రంప్ రాశాడు. తన పాలనలో సాధించిన విజయాల వల్లనే వర్తమానంలో ఆర్థిక వ్యవస్థ సజీవంగా ఉందని ఆయన అన్నాడు. జో బైడెన్ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగి వినియోగదారుల కొనుగోలు శక్తి పూర్తిగా నశించిందని ట్రంప్ చెప్పాడు. 2021లో బైడెన్ పాలన మొదలయ్యాక ద్రవ్యోల్బణం 17% దాకా ఉందని చూపే గణాంకాలు లోపభూయిష్టమైన వని, అవి దాదాపు సగం ద్రవ్యోల్బణాన్ని మాత్రమే చూపిస్తున్నాయని, పాత పద్ధతి ప్రకారం గణిస్తే ద్రవ్యోల్బణం 30%దాకా ఉంటుందని ఆయన వాదిస్తున్నాడు. బైడెన్ పాలనలో ద్రవ్యోల్బణం గత 40సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఉంది.
1929లో జరిగిన స్టాక్ మార్కెట్ పతనంతో డౌ జోన్స్ పారిశ్రామిక సగటు 89% మూడు సంవత్సరా లపాటు పతనం అయింది. రెండు దశాబ్దాల తరువాత సంభవించిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేవరకు ఈ పతనం నుంచి అమెరికా కోలుకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాతే అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందింది. పట్ట పగ్గాలులేని స్పెక్యులేషన్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచటంవంటి అనేక కారణాలవల్ల అప్పటి మహామాంద్యం సంభవించింది. బైడెన్ పాలనకు కేవలం 34% కొత్త ఓటర్లు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని బైడెన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమెరికా వినియోగదారుల క్రెడిట్ కార్డు బకాయిలు గత నెలలో చరిత్ర లో ఎన్నడూ లేనంతగా ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, జెపి మోర్గాన్ విశ్లేషకులు పేర్కొన్నట్టుగా ఈ పరిస్థితి కోవిడ్-19 మహమ్మారి కాలంలో అమెరికన్లు చేసుకున్న పొదుపు పూర్తిగా కరిగిపోయిందని సూచిస్తోంది. ప్రతి 10మంది అమెరికన్లలో 4గురి దగ్గర అత్యవసర స్థితి ఏర్పడినప్పుడు ఆదుకునేందు కోసం 400డాలర్లు కూడా లేవని మే నెలలో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. అదే సమయంలో ఎస్‌ఎంపి 500 ఎన్నడూలేనంత ఎక్కువగా ఉంది. అలాగే డౌ జోన్స్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది.