
– అమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు,
– నిర్మాణాలకు పర్మిషన్ ఎక్కడిది,
– నడి బొడ్డున జరుగుతున్న కబ్జాపై చోద్యం చూస్తున్న అధికారులు.
నవతెలంగాణ-సూర్యాపేట : పట్టణ నడిబొడ్డున జేజే నగర్ 29 వ వార్డులో గల సర్వే నెంబర్ 817 ప్రభుత్వ భూమి లో గల ఒక ఎకరం 6 గుంటల స్థలం అదృశ్యం అయింది.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అనే ఆర్టికల్ శుక్రవారం నవ తెలంగాణ దిన పత్రికలో వచ్చిన విషయం తెల్సిందే. కాగా ఈ సర్వే నెంబర్ లో చోటుచేసుకున్న పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 816,817,818 సర్వే నెంబర్లు ఉన్నాయి.వీటి వివరాలు కోరుతూ కట్ట శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం-2005 క్రింద ఈ సంవత్సరం జనవరి 22 న దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని పరిశీలించిన తహశీల్దార్ దీనికి ప్రతిగా స్పందిస్తూ అందులోని వాటికి వివరాలను ఫిబ్రవరి నెలలో అందజేశారు. ఆ వివరాల ప్రకారం…సూర్యాపేట గ్రామ సేత్వార్ రికార్డు ప్రకారం 817 సర్వే నెంబర్ మాత్రమే ప్రభుత్వ భూమి అని 816,818 సర్వే నెంబర్లు చౌద ఇనాం భూములని తహశీల్దార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దరఖాస్తు దారుడు కోరిన ప్రకారం 817 ప్రభుత్వ సర్వే నెంబర్ లో ఒక ఎకరం 31 గుంటలు ఉందని అదేవిధంగా 816 లో ఒక ఎకరం 25 గుంటలు,818 లో ఒక ఎకరం 23 గుంటలు ఉందని లిఖితపూర్వకంగా వివరాలు చెప్పడం జరిగింది. కాగా కార్యాలయ రికార్డు ల ప్రకారం 817 లోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఒక ఎకరం 31 గుంటల స్థలంలో అంబెడ్కర్ స్టడీ సర్కిల్ నిర్మాణం నిమిత్తం 0.18 గుంటలు కేటాయించగా కుమ్మరి సంఘం కమ్యూనిటీ హల్ హాస్టల్ భవనం నిర్మాణం 0.7 గుంటల స్థలాన్ని ఇవ్వడం జరిగిందని వివరాలను తహశీల్దార్ వివరించారు. తహశీల్దార్ ఇచ్చిన వివరాల ప్రకారం అయితే మొత్తంగా 25 గుంటల స్థలం అభివృద్ధి పనులకు కేటాయించిన మరి మిగిలిన ఒక ఎకరం 6 గుంటల స్థలం ఎక్కడికి పోయిందనేది తేలాల్సి ఉంది.పట్టణ నడిబొడ్డున ఎంతో కోట్లాది రూపాయల విలువ గల భూమిని యధేచ్చగా కబ్జా చేసుకొని నిర్మాణాలు చేస్తుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎం చేస్తున్నట్లు అనే అనుమానపు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో ఏ ప్రాతిపదికన నిర్మాణం చేస్తున్నారు. మరి మున్సిపల్ టిపిఓ సెక్షన్ నిద్రావస్థలో ఉందా లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా ఇటీవలే కమిషనర్ ఈ నిర్మాణాలను కూల్చివేయించినప్పటికి పొలిటికల్ ఎంట్రీ తో తిరిగి పది రోజుల్లో నే నిర్మాణాలు కొనసాగుతుoడడం గమాన్హారo. కాగా కబ్జా దారులు అధికారులను బెదిరించి మరి నిర్మాణాలు చేస్తున్నట్లు సమాచారం. కండ్లు ఉండి చూడలేని కబోది లాగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.ఇప్పటి కైనా జిల్లా స్థాయి అధికారులు ఈ కబ్జా పై స్పందించి 817 సర్వే నెంబర్ లో మాయం అయిన ఒక ఎకరం 6 గుంటల స్థలాన్ని వెతాకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ సర్వే నెంబర్ పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. మరి సంబంధిత అధికారులు ఈ కబ్జా వ్యవహారం పై ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాలి.