– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అన్న భావనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సీపీఐ(ఎం) పునరుద్ఘాటిం చింది. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఐక్యంగా వ్యతిరేకించాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య సంస్థలకు, పౌరులకు విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల కు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసు, దీనిని సాధించేందుకు అది ప్రతిపాదించిన చర్యలు తిరోగమనంతో కూడినవని వ్యాఖ్యానించింది. ఇవి దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ స్థాపనకు దారి తీస్తాయని పేర్కొంది. పార్టీ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు 18 సవరణలు చేయాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. ఇవి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్లబొడిచేవిగా, అలాగే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును హరించేవిగా ఉన్నాయి.
అంతేకాదు, కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో కేంద్రానికి మరిన్ని అధికారాలిచ్చేవిగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు, 18వ లోక్‌సభ ఎన్నికల తరువాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని తగ్గించాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా 19వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రతిపా దించారు. అంటే దీనర్ధం 2026లో ఎన్నికలు జరగాల్సిన పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలం ఈ చర్య వల్ల సగానికన్నా పైగా కుదించబడుతుంది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించిన వంద రోజుల్లోగా అన్ని పంచాయితీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వ హించాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించి, నిర్వహిస్తూ వుంటాయి. మూడు స్థాయిల్లో ఎన్నికలకు ఉమ్మడి ఓటర్ల జాబితాలు, అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికారాలు కేంద్రీకృతమవుతాయని, అది పంచాయి తీలు, స్థానిక సంస్థల ప్రాధమిక సూత్రమైన వికేంద్రీకరణ వ్యవస్థకే పూర్తి విరుద్ధమని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
అందుకే ఒక దేశం, ఒక ఎన్నిక అన్న భావనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పొలిట్‌బ్యూరో మరోసారి స్పష్టం చేసింది. ఈ అప్రజాస్వామిక చర్యను సమైక్యంగా వ్యతిరేకించాలని అన్ని ప్రజాతంత్ర శక్తులకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.