ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ఈవీఎంలకే రూ.10 వేల కోట్లు

న్యూఢిల్లీ: పొదుపు, అభివద్ధికి అడ్డంకులు తొలగాలన్న వాదనలతో బీజేపీ ముందుకు తెచ్చిన ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ కోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది. 2015లో పార్లమెంట్‌ లీగల్‌ అండ్‌ పర్సనల్‌ స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన అంచనాల ప్రకారం కేవలం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లకే లోక్‌ సభ, శాసనసభలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలంటే రూ.9284.15 కోట్లు అవసరం. 2014 నుంచి 2019 వరకు కేంద్రం రాష్ట్రాలకు రూ.5,814.29 కోట్లు మాత్రమే ఇచ్చింది.ఈవీఎంలు, ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌, ఆడిట్‌ ట్రయిల్‌ మెషీన్లు తదితరాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుందని, పదిహేనేండ్ల జీవితకాలం ఉన్న ఈవీఎంలను మూడు రెట్లు మాత్రమే ఉపయోగిస్తే ఖర్చు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఒపి రావత్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2015లో దీనిపై అధ్యయనం చేయాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరినప్పుడు రావత్‌ అందులో సభ్యుడు. కనీసం 30 లక్షల ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు అవసరం. రాజ్యాంగ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణలు అవసరం. ప్రస్తుతం భారత్‌లో ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటుకు ఒక్క డాలర్‌ మాత్రమేనని రావత్‌ తెలిపారు. మరో మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టిఎస్‌ కష్ణమూర్తి కూడా ఎన్నికలు పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఈవీఎంల నిర్వహణ చాలా కష్టమని టెక్నికల్‌ కమిటీ సభ్యుడు తెలిపారు. రజత్‌ మూనా కూడా స్పష్టం చేశారు. 6-7 లక్షల ఈవీఎంల తయారీకి కనీసం ఏడాది సమయం పడుతుందని చెప్పారు. మార్చి వరకు కమిషన్‌ వద్ద 13.06 లక్షల కంట్రోల్‌ యూనిట్లు (సీయూ), 17.77 లక్షల బ్యాలెట్లు మాత్రమే ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి పార్లమెంటుకు తెలిపారు. దేశమంతటా ఏకకాలంలో కేంద్ర సైన్యాన్ని మోహరించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు.