ఒక దేశం – ఒకే ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం

One country - one election Unconstitutional– నిరంకుశ, అధ్యక్ష పాలనకు దారితీస్తుంది
– సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం
– జాతీయ అంశాలకే ప్రాధాన్యత
– స్థానిక సమస్యల ప్రస్తావన ఉండదు
– పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
– దామాషా ఎన్నికల విధానాన్ని తేవాలి : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒక దేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. అది అమలైతే నిరంకుశ పాలనకు, అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుందని హెచ్చరించారు. సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందనీ, రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని చెప్పారు. దామాషా పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘ఒకదేశం ఒకే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలపర్చడానికేనా?’అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ వార్డు నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఉంటుందనీ, స్థానిక సమస్యల ప్రస్తావన ఉండబోదని వివరించారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండబోదన్నారు. సమాఖ్య వ్యవస్థ (ఫెడరలిజం) ఉంటేనే రాష్ట్రాలకు హక్కులుంటాయని వివరించారు. అప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందన్నారు. ఒక దేశం ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తూ రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాలు చెప్పాయని గుర్తు చేశారు. ఇది మంచిదేననీ, అమలు చేయాలంటూ బీజేపీ అభిప్రాయపడిందని చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నికలపై 2018, జులైలో దానిపై లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరిందనీ, అది మంచిది కాదంటూ లా కమిషన్‌కు సీపీఐ(ఎం) చెప్పిందని అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నికలపై నిటి ఆయోగ్‌ చర్చా పత్రం విడుదల చేసిందన్నారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఆ నిర్ణయం దేశ ఐక్యతకు మంచిదా?, లేదా? అనే దానిపై చర్చ చేయకుండా అమలు చేయాలని చెప్తున్నదని అన్నారు. పార్లమెంటు, కేంద్ర క్యాబినెట్‌, అసెంబ్లీలు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా, ఎక్కడా చర్చించకుండా అమలు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. అత్యధికులు, రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు మంచిది కాదంటే ఆ నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గాలని సూచించారు. ఆ నిర్ణయం బాగుందని చెప్తే ముందుకుపోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆ ప్రక్రియను చేపట్టకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజకీయ పార్టీలను ఎగతాళి చేస్తూ రాష్ట్రాలను ఖాతరు చేయకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నదని విమర్శించారు. వరుస ఎన్నికలతో సమయం, డబ్బు వృధా అవుతున్నాయనే వాదనకు అర్థం లేదన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అధికార సిబ్బంది, ఈవీఎంలు, పోలీసు యంత్రాంగం అధికంగా అవసరమవుతుందని చెప్పారు. వరుస ఎన్నికలు అభివృద్ధికి ఆటంకమనీ, ఎన్నికల కోడ్‌తో పనులు ఆగిపోతాయన్న చర్చను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ప్రజానుకూల విధానాలను అమలు చేయడానికి ఏ ఎన్నికలు అడ్డం వస్తున్నాయని ప్రశ్నించారు. సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేయడానికే అడ్డం వస్తున్నాయని విమర్శించారు. అమెరికా, బ్రిటన్‌, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అన్ని మతాలు, కులాలు, భాషలు, ఆహారపు అలవాట్లు, ఎంతో వైవిధ్యం దేశంలో ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కొనసాగాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలని కోరారు. అందువల్లే చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తాయని వివరించారు. ఈసీ, కాగ్‌, ఫైనాన్స్‌ కమిషన్లను స్వతంత్రంగా ఉంచాలని సూచించారు. ఐదేండ్ల వరకు ఎన్నికలు జరపాలని రాజ్యాంగంలో ఉందనీ, మధ్యలో జరగొద్దని దాని ఉద్దేశం కాదన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం అవిశ్వాసం పెట్టొద్దనీ, ఎవరైనా చనిపోతే ఎన్నికలు జరపొద్దని ఎక్కడా లేదని చెప్పారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఐదేండ్ల కాలంపాటు ఉంటారనీ, ఏదైనా తప్పులు చేస్తే రీకాల్‌ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దామాషా పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలనీ, ప్రభుత్వమే ఖర్చు చేయాలని కోరారు. అవిశ్వాసంలో ప్రభుత్వం కూలిపోతే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదా?అని ప్రశ్నించారు. ఫెడరలిజం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోరుకునే వారు ఒక దేశం ఒకే ఎన్నికలను వ్యతిరేకించాలని సూచించారు.
రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రం పెత్తనం కొనసాగుతుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని చెప్పారు. అధ్యక్ష తరహా పాలన కోసం వాజ్‌పేయి ప్రయత్నించారనీ, వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. ఇప్పుడు మోడీ హయాంలో ఒక దేశం ఒకే ఎన్నికల రూపంలో అధ్యక్ష పాలనకు దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంవైపు కాకుండా నిరంకుశత్వం, రాచరికపు పాలన సాగించాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నదని చెప్పారు. హిందూత్వ రాజ్యం కోసమే బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నదనీ, దీన్ని నిరోధించాలని అన్నారు. పలువురు అడిగిన పలు ప్రశ్నలకు రాఘవులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.