ఏదో ఒకరోజు నేను సీఎం అవుతా..!

– నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒకరోజు తాను సీఎంను అవుతానని భువనగిరి ఎంపీ, నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్డు షోలో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ పార్టీ మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు నష్టం జరుగు తుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చా రన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదన్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యల కోసం తెలంగాణను తెచ్చుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలింగ్‌ చివరి రోజున రైతుబంధు డబ్బులు వేస్తారని, ఎవరూ మోసపోవద్దని హితవు పలికారు. నల్లగొండలో ప్రస్తు తం కనిపిస్తోన్న అభివద్ధి తాను చేసిందే అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన ఆరు గ్యారంటీ లను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ కట్టిన నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు డెబ్బై ఏళ్లయినా చెక్కు చెదరలేదని, కానీ కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం బ్యారేజీ అప్పుడే బీటలు వారిందన్నారు. డిసెంబర్‌ 9 మన లక్కీ నెంబర్‌ అని, ఆ రోజు సోనియా పుట్టిన రోజు అని, ఆ రోజే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.