– జేపీకి రూ.200 కోట్ల విరాళం ఇచ్చిన ‘క్విక్ సప్లరు చెయిన్’
– దానికి రిలయన్స్ గ్రూపుతో సంబంధాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల ముందు 2022 జనవరిలో ఒకే రోజు, ఒకే కంపెనీ బీజేపీకి రూ.200 కోట్ల విరాళం అందించింది. ఈ నెల 17న ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైటులో అప్‌లోడ్ చేసిన వివరాల ఆధారంగా ఈ విషయం బయటపడింది. తనకు విరాళం ఇచ్చిన దాతల పేర్లను ఎన్నికల కమిషన్‌కు బీజేపీ వెల్లడించలేదు. కానీ బాండ్లు కొనుగోలు చేసిన తేదీని, వాటిని ఏ నగరంలో కొనుగోలు చేశారు అనే సమాచారాన్ని తెలిపింది. 2022 జనవరి ఐదవ తేదీన ఒక్కోటి కోటి రూపాయల విలువైన రెండు వందల బాండ్లను ముంబయిలో కొనుగోలు చేసి, బీజేపీకి విరాళంగా అందించారు.
‘ది క్వింట్’ అనే న్యూస్ పోర్టల్ ఆ విరాళానికి సంబంధించిన పత్రాలను అధ్యయనం చేసింది. ముంబయికి చెందిన క్విక్ సప్లరు చెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మాత్రమే 2022 జనవరి 5వ తేదీన రూ.200 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిందని తేల్చింది. ఈ కంపెనీకి రిలయన్స్‌తో సంబంధాలు ఉన్నాయి.
ఆ తేదీన మరే ఇతర కంపెనీ అంత విలువైన బాండ్లను కొనుగోలు చేయలేదని గత వారం ఎస్‌బీఐ విడుదల చేసిన జాబితాను బట్టి కూడా తెలుస్తోంది. ఆ తేదీన ముంబయికే చెందిన రెండు కంపెనీలు రూ.7 కోట్లు, రూ.25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి.
క్విక్ సప్లరు చెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 10న రూ.10 కోట్ల విలువైన బాండ్లను కొన్నది. రాష్ట్రాలలో శానససభ ఎన్నికలు జరగడానికి ముందు ఈ కంపెనీ మూడు సార్లు బాండ్లను కొనుగోలు చేయడం గమనార్హం. 2022 నవంబర్ 11న ఈ కంపెనీ రూ.125 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. ఈ పద్దు బీజేపీ రికార్డులలోనూ కన్పించింది. 2023 నవంబర్ 17న ఈ సంస్థ మరో రూ.50 కోట్ల బాండ్లను కొన్నది. క్విక్ సప్లరు చెయిన్ కంపెనీ గిడ్డంగులు, స్టోరేజీ యూనిట్లను నిర్మిస్తుంది. దీనిలో డైరెక్టర్‌గా ఉన్న తపస్ మిత్రా పలు రిలయన్స్ గ్రూపు సంస్థల్లో కూడా డైరెక్టర్‌గా పనిచేశారు.