– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– జర్నలిస్టులకు అండగా ఉంటామని వ్యాఖ్య
– ఇందిరమ్మ గృహ నమూనా ఇంటికి భూమిపూజ
– దరఖాస్తుదారులతో ఫోన్‌ఇన్
నవతెలంగాణ-దమ్మపేట
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక కన్ను వేసి ఉంచుతామని, మరోకన్ను దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంపై ఉంచుతామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట మండలంలోని నాచారం గ్రామంలో గున్నేపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో ప్రభుత్వం నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, నీటి పారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజరుబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. దమ్మపేట మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ గృహ నమూనా ఇంటికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇంటిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, సంవత్సరానికి 20లక్షల చొప్పున 80 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, అందులో జర్నలిస్టులకు స్థలం ఉన్న వారికి తొలి జాబితాలో కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలన్నీ తనకు తెలుసునని, వారికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల జరిగిన భూ బదలాయింపులు, వారసత్వపు బదలాయింపులు, ఇతర బదలాయింపులు జరిగినటు వంటి వాటిని డిప్యూటీ తహసీల్దార్ ద్వారా రికార్డులను తెప్పించుకొని పరిశీలించారు.
క్రయ, విక్రయదారులకు, దరఖాస్తుదారులకు ఫోన్
క్రయ, విక్రయదారులకు, దరఖాస్తుదారులకు నేరుగా మంత్రి పొంగులేటి ఫోన్‌చేశారు. ‘ నేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మాట్లాడుతున్నాను మీ అనుమతితోనే భూ బదలాయింపులు జరిగాయా, అధికారులకు ఏమన్నా లంచాలు ఇచ్చారా’ అంటూ ప్రశ్నించారు. కొంతమంది రైతులు అట్లాంటివి ఏమీ జరగలేదని, 25 రోజుల లోపులోనే రిజిస్ట్రేషన్‌లు అయ్యాయని సమాధానాలు ఇచ్చారు. మీరు ఎవ్వరికీ భయపడవద్దని దమ్మపేట తహశీల్దార్ కార్యాలయంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్నాయని మీకు ఏమన్నా ఇబ్బందులు కలిగితే తనకు తెలియజేయాలని అవినీతి లేనిపక్షంలో మంచిదేనని రైతులకు తెలిపారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభ్యర్థన మేరకు అశ్వారావుపేట నియోజకవర్గంలో 3500 ఇండ్లు మాత్రమే కాకుండా అదనంగా మరిన్ని కేటాయిస్తామని ఆయన వివరించారు. మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు మంత్రి పొంగులేటికి శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, మార్కెట్ యార్డ్ చైర్మెన్ వాసం రాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు గంగాధర్‌రావు, కోటగిరి సత్యంబాబు, పర్వతనేని వర ప్రసాదరావు, యువజన నాయకుడు చామర్తి గోపిశాస్త్రి, రావు పండుబాబు పాల్గొన్నారు.
దూరంగా తుమ్మల గ్రూపు
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఏకపక్ష తీరుతో తాము ఇబ్బందులకు గురౌతున్నామని గురువారం జరిగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనను బారుకాట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. పొంగులేటి పర్యటనకు దూరంగా ఉండటంతో తుమ్మల వర్గీయులు మాట నిలబెట్టుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.