పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

– వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ : రాయపోల్ మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాలని వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పాఠశాలల రికార్డులన్నిటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. పిల్లల విద్యాభివృద్ధికై ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 10 వ తరగతి విద్యా జీవితంలో మొదటి అడుగు దాన్ని సరిగా వేయడానికి విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులు బోధించిన అంశాలు సక్రమంగా నేర్చుకొని అందరూ ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమని క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలియజేశారు. అనంతరం డిఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు. అనంతరం వారు పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించి విద్యార్థుల స్నాక్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి ఆక్షన్ ప్లాన్ ఉపాధ్యాయులు అందరూ చక్కగా అమలు పరచాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నాగరాజు, కేజీబీవీ ఎస్ఓ సుగంధ లత, ఉపాధ్యాయులు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.