నూటికి నూరు శాతం సాధ్యమే…

– ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలను చేరుకోవటం నూటికి నూరు శాతం సాధ్యమేనని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. గతేడాది మహారాష్ట్ర సర్కారు వందకు వంద శాతం అంచనాలను చేరుకుందని గుర్తు చేశారు. బడ్జెట్‌ ప్రతిపాదన అనంతరం శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2018-19లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు రూ.లక్షా 80 వేల కోట్లతో పద్దును రూపొందించామని తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూ.లక్షా 40 వేల కోట్లకు కుదించామని వివరించారు. ఇప్పుడు వాస్తవాలకు అనుగుణంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కాబట్టి, నాలుగు నెలల తర్వాత ప్రతిపాదించబోయే పూర్తి స్థాయి బడ్జెట్‌ మొత్తం ఇప్పటికంటే పెరుగుతుందని అంచనా వేశారు. ఆస్తులు పెంచటం వల్ల రాష్ట్ర ఆదాయం సమకూరుతుందనీ, అదే మాదిరిగా అప్పులను తగ్గించినా, పొదుపు చేసినా కూడా ఆదాయం పెరగుతుందని ఆయన వివరించారు.