– వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం
– మార్చ్ 3 నుండి ప్రారంభం
– మారుమూల కొండ ప్రాంతాల పిల్లలకు చుక్కల మందు అందేలా చూడాలి
నవతెలంగాణ-పాల్వంచ
మార్చి 3న నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య, జిల్లా అధికారులతో పల్స్ పోలియో పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97522 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ వంద శాతం పల్స్ పోలియో చుక్కలు వేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. ఏదైనా కారణం చేత పల్స్ పోలియో చుక్కలు వేయని మిగిలిన చిన్నారులకు 4, 5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, ఐసీడీఎస్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ఆర్టీసీ, రైల్వే శాఖ, పబ్లిక్ రిలేషన్ శాఖ అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 ఏండ్ల పిల్లల వరకు ప్రతి ఒక్కరికీ రెండు చుక్కల పోలియో మందు వేయాలన్నారు. జిల్లాలో 925 పోలియో కేంద్రాలు, 38 సంచార పోలియో టీంలు, 33 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్యాధికారి శిరీష కలెక్టర్‌కు వివరించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది వాలంటీర్లు పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గిరిజన, మత్స్యకార ప్రాంతాల్లోని పిల్లలకు చుక్కలమందు అందేలా చూడాలన్నారు. అలాగే, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో పోలియా బూత్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. పల్స్ పోలియోపై అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని, రద్దీగా ఉండే ప్రదేశాలు పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పల్స్ పోలియో పై తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీఆర్‌డీఓ పీడీ విద్యాచందన, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.