ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరికి పోషకాహార లోపం

ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరికి పోషకాహార లోపం–  గాజాపై యునిసెఫ్‌ అధ్యయనంలో వెల్లడి
గాజా : గాజాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ యునిసెఫ్‌ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. గాజా వ్యాప్తంగా ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా వున్నాయని తెలిపింది. ఇజ్రాయిల్‌ సైన్యం జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 29వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. మొత్తంగా నివాస ప్రాంతాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 80శాతానికి పైగా జనాభా నిర్వాసితులయ్యారు. ఈ నేపథ్యంలో యునిసెఫ్‌ నేతృత్వంలో గ్లోబల్‌ న్యూట్రిషన్‌ క్లస్టర్‌ అధ్యయనం జరిపి నివేదిక ఇచ్చింది. గాజాలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 90శాతానికి పైగా పిల్లలు రోజుకు రెండు లేదా అంతకంటే తక్కువ ఆహార రకాలు తింటున్నారని పేర్కొంది. ఇది తీవ్ర ఆహార దారిద్య్రం కిందకు వస్తుందని పేర్కొంది. అంటువ్యాధులతో బాధపడుతున్న పిల్లలు కూడా దాదాపు 90శాతం మంది వున్నారని తెలిపింది. గత రెండు వారాల్లో 70శాతం మంది డయేరియాతో బాధపడుతున్నారని పేర్కొంది.
గాజాలో 80శాతానికి పైగా ఇళ్లకు పరిశుద్ధమైన, సురక్షితమైన నీరు అందుబాటులో వుండడం లేదు. సగటున ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఒక రోజుకు ఒక లీటరు నీరు లభ్యమవుతోందని ఆ నివేదిక తెలిపింది. మానవతా సాయం చాలావరకు అందుతున్న దక్షిణ ప్రాంత నగరమైన రఫాలో తీవ్రమైన పోషకాహార సమస్య 5శాతంగా వుంది. అదే సమయంలో ఉత్తర గాజాలో 15శాతంగా వుంది. యుద్ధానికి ముందు గాజా వ్యాప్తంగా పోషకాహార సమస్య 1శాతం కన్నా తక్కువగానే వుందని నివేదిక పేర్కొంది. గాజాలో నివారించదగ్గ బాలల మరణాలు కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని యునిసెఫ్‌ అధికారి టెడ్‌ చాలిబన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాజాలోని 23లక్షలమంది జనాభా ఆహార సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నారని, అందులో నాల్గవ వంతు జనాభా తీవ్రంగా కరువు బారిన పడ్డారని డిసెంబరులో ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
తాము మానవతా సాయాన్ని అడ్డగించడం లేదని ఇజ్రాయిల్‌ చెబుతున్నప్పటికీ ఇజ్రాయిల్‌ సైనిక దాడుల్లో ధ్వంసమైన రోడ్లు, మౌలిక వసతుల కారణంగా సహాయ బృందాలు గమ్యస్థానాలను చేరలేకపోతున్నాయి. పది లక్షల మందికి పైగా ప్రజలకు ఆహారాన్ని అందించగల రవాణాను ఇజ్రాయిల్‌ ఆపేసిందని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ ఈ నెల ఆరంభంలో పేర్కొంది.