‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వెనుక…

Behind 'One Nation-One Election'...ఒక దేశం ఒక ఎన్నిక, అదే జమిలి ఎన్నికల నినాదం… కొన్నాళ్ళు తెరమరుగై మళ్లీ హఠాత్తుగా తెర మీదకి రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మార్పులు చకచకా జరిగిపోతున్న తీరుచూసి జనం విస్తుపోతున్నారు. హఠాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటు, జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించటానికి కమిటీ వేస్తామని చెప్పటం, వెనువెంటనే రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో అమిత్‌షాతో కలిపి ఎనిమిది మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాల జారీ శరవేగంగా జరిగాయి. పార్లమెంటును సమావేశపరుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామాలు జెట్‌ స్పీడుతో సాగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ ఆదేశాల్లో ముఖ్యమైన అంశం ఈ కమిటీ తన పనిని వెనువెంటనే ప్రారంభించి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలి. ‘వీలైనంత త్వరగా’ అనేది అతి ముఖ్యమైన మాట. ఎందుకంటే ఈ కమిటీకి కేవలం 15రోజుల వ్యవధి మాత్రమే నిర్దేశించారు పైకి చెప్పకపోయినా. సెప్టెంబర్‌ 3 నుంచి 17 వరకు ఉన్న వ్యవధి కేవలం 15రోజులు మాత్రమే. ఈలోగానే కమిటీ ఆసక్తి ఉన్న వర్గాల అభిప్రాయాలు వినాలి, వాదనలు పరిగణించాలి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి, నివేదిక తయారు చేయాలి. ఎందుకింత హడావుడి? వాస్తవానికి నివేదిక ఇప్పటికే తయారైవున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఎనిమిది మందిలో రాజ్యాంగం మీద అవగాహన ఉన్నది కేవలం ఇద్దరికే. వారు హరీష్‌ సాల్వె, సుభాష్‌ కశ్యప్‌. కాంగ్రెస్‌ నుంచి అధిర్‌ రంజన్‌ చౌదరి, కాంగ్రెస్‌ రెబెల్‌ నేత గులాంనబి ఆజాద్‌, అమిత్‌ షాతో కలిపి ముగ్గురు రాజకీయ నేతలు. న్యాయ శాఖామంత్రి ప్రత్యేక ఆహ్వానితుడు. ఒక్క అధిర్‌ రంజన్‌ చౌదరి తప్ప మిగిలిన అందరూ బీజేపీకి మద్దతుదారులే. దీన్నిబట్టి ఇదో తూతూ మంత్రం అంటూ అధీర్‌ రంజన్‌ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి సంబంధిత వర్గాలతో సంప్రదింపులనీ, నిపుణుల కమిటీ నివేదిక అనీ రంగులు అద్దటం అవసరం. ఈ రంగులతోనే మోడీ ఆలోచనకు ఆమోద ముద్ర వేయించుకోవాలని బీజేపీ నేతల ఉద్దేశం. రేపు ఉత్తరోత్తరా వచ్చే న్యాయపరమైన చిక్కులకు ఈ కమిటీ నివేదిక ఒక సాకుగా ఉపయోగపడుతుంది. చేసేది తప్పయినా పద్ధతి ప్రకారం చేయటం మన రాజకీయాల్లో ‘మంచి’ సంప్రదాయం. అందుకే ఈ కమిటీ ఒక తంతు అనిపిస్తోంది. ఇంత తీవ్రమైన విషయాన్ని హడావుడిగా, అదీ ఎన్నికలు ఏడాదిలోపు ఉండగా, పరిశీలిం చాల్సిన అవసరమేంటి? కేవలం 15రోజుల్లో ఎలా పరిశీలించగలరు ఎంత గొప్ప నిపుణులైనా? ప్రభుత్వానికి ‘తగిన’ నివేదిక ఇస్తారనటంలో సందేహం లేదు. అనంతరం సభ్యు లకు తగినరీతిలో తాయిలాలు అందుతాయి !
సుభాష్‌ కశ్యప్‌ లాంటి వారు ఇంత తక్కువ సమయంలో ఎలా పరిశీలించాలని ప్రశ్నించాలి. కానీ ఏమీ అనరు. అందుకే ఈ కమిటీ ఒక తంతు అనిపిస్తుంది. మరోవైపు అనురాగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. లోక్‌సభకు, అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలుండవు అంటున్నారు. అలాంటప్పుడు ఇంత హడావుడిగా ఈ కోవింద్‌ కమిటీ ఎందుకు? పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచటం ఎందుకు? ప్రజల దృష్టిని మరల్చి, ఉమ్మడి పౌర స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని చర్చ లేకుండా పార్లమెంటు ఆమోదం పొందటానికా? ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రజలకు చెప్పాలికదా! మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేదిగా వున్నప్పుడు. అనేక క్లిష్టమైన విషయాలు ఇమిడి వున్నాయి జమిలి ఎన్నిక అనే అంశంలో. చట్టసభలకు ఐదేండ్ల కాల పరిమితి అనేది మార్చాలి. ముందస్తుగా లోక్‌సభనుగానీ శాసనసభనుగానీ రద్దు చేసే వీలుండదు. లోక్‌సభలోగానీ, అసెంబ్లీలోగానీ అవిశ్వాస తీర్మానం అనే అంశానికి అర్థం మారిపోతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గి, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోతే అప్పుడు కేంద్రంలో పరిస్థితి ఏంటి? రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. కానీ మన రాజ్యాంగంలో కేంద్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు కదా. అధికారంలో ఉన్న పార్టీ చట్టసభ విశ్వాసం కోల్పోతే ప్రజల తీర్పు కోరటం ఇప్పుడున్న మార్గం. ఆ మార్గం బందవుతుంది. ప్రజలు నిస్సహాయు లవుతారు. పైగా జమిలి అంటే రాష్ట్రాల హక్కులను హరించటమే కదా! ఈ ఆలోచన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేదిగా ఉంది.
దేశ ప్రజలు అలోచించి అవగాహన చేసుకోవటానికి తగినంత సమయం ఇవ్వకుండా త్వరత్వరగా పని కానిచ్చేయటం మోడీ తీరు. పెద్దనోట్ల రద్దు కానియ్యండి, లాక్‌డౌన్‌ కానీయండి కేవలం నాలుగే నాలుగు గంటల వ్యవధితో ప్రజల మీద రుద్దిన అత్యంత కఠిన నిర్ణయాలు. ఒకసారి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం అని కరాఖండిగా చెబితే సరే అయ్యిందేదో అయ్యిందనే అభిప్రాయం సహజంగానే కలుగుతుంది. దీన్నే ఫెయిట్‌ అక్కంప్లి అంటారు సైకాలజీ పరిభాషలో. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు ఒప్పుకోవడం తప్ప ఇంకేమి చేయలేము అనేది దీని సారాంశం. ఆమోద యోగ్యం కాని నిర్ణయాన్ని ఆమోదింపచేయటానికి బాగా తెలిసిన మానసిక మార్గం ఇది. దీన్ని చాలా సందర్భాల్లో వాడారు మన వ్యవస్థలో. ఉదాహరణకు ఆర్టికల్‌ 370 రద్దు అనేది ఎటువంటి సంకేతం లేకుండా ఒకే ఒక్క రోజులో పూర్తి అయ్యింది. చర్చ, సమాధానం లేవు.
అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిం చటానికి రాజకీయ పార్టీలు బలంగా లేకపోవటం, ప్రధాన మీడియా సంస్థలు ప్రజల పక్షాన నిలబడక పోవటం, న్యాయ వ్యవస్థ నత్తనడక ఇక్కడ పెద్ద సమస్యలు. నియంతత్వ ధోరణి వున్నవారు ఎదుటివారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు. ఎంత త్వరగా ఫెయిట్‌ అక్కంప్లిని మదిలోకి చొప్పిస్తే అంత మంచిదనేది వీరి ఆలోచన. ఆలోచించే వ్యవధి ఇస్తే దానికి వ్యతిరేకంగా స్పందనలు రావటం, ఆందోళనలు మొదలవ్వటం, మీడియాలో రావటం ఇదంతా అనవసరం కాదా! ఆందోళనలను నిలువరించటం కన్నా నివారించ టం మేలు కదా అనేది ఇక్కడ ఆంతర్యం.
మన దేశంలో హదయాంతరాళంలో జీర్ణించుకున్న విశ్వాసాలకు విఘాతం కలిగితే తప్ప ప్రజలు స్వచ్ఛందంగా స్పందించరు. వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించటం భారతీయుల స్వభావం కాదు. సిద్ధాంతానికి కట్టుబడినవారు, భావజాలంతో ప్రేరేపితమైనవారు తప్ప మెజారిటీ ప్రజలు పోలీసులకు కోర్టులకు దూరంగా ఉండాలనే కోరుకుంటారు. ఆందోళన చేసేవారు, అలజడి సృష్టించేవారు ఎక్కువగా అద్దెకు వచ్చిన మూకలే. అటువంటివారు, గుంపులో గోవిందయ్యలా తప్పించుకోవచ్చు అనుకుంటారు. లేకపోతే వారి యజమానులు వారి బాగోగులు చూసుకుంటారనే నమ్మకంతో ఉంటారు. సామాన్యజీవి చట్టాన్ని ఉల్లంఘించి ఆందోళన చేయాలనుకోడు. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా ఆందోనళ చేశారా? లాక్‌డౌన్‌ కూడా అంతేకదా! వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రాణాంతకమైన ప్రయాణం కొనసాగించారుగానీ ఎవరైనా నోరు మెదిపారా?
నేడు దేశం అనేక రంగాల్లో ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. జనాభా పెరుగుదల, నిత్యా వసరాల ధరల పెరుగుదల, ఉపాధి లేమి, నిరుద్యోగ సమస్య, కోర్టుల్లో పెండింగు కేసులు, రైతులు ఎదుర్కొనే సమస్యలు, విదేశీ విధానంలో సమస్యలు… వీటిని వదిలి మరుగునపడ్డ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తేవడం ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేమో అనే సందేహమూ కలుగుతుంది. జమిలి ఎన్నికల కోసం వేసిన కమిటీ పాలక వర్గాలకు సానుకూల నివేదిక ఇస్తుంది. హౌంమంత్రి సభ్యుడుగా ఉండటమే ఇందుకు నిదర్శనం. దీన్ని బలంగా ప్రతిపాదిస్తున్న వారు కమిటీలో వుంటే అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? స్వేచ్ఛగా చర్చ ఎలా సాధ్యమవు తుంది? బహుశా అందుకేనేమో కాంగ్రెస్‌ సభ్యుడు తప్పుకున్నాడు కమిటీ నుంచి. ఇప్పుడు మిగిలిన అందరూ బీజేపీ అనుకూలురే. సందట్లో సడేమియా అన్నట్లు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కూడా ప్రవేశపెట్ట వచ్చు. ఎన్నికలు ఒక్కటే ప్రజలకున్న ఆయుధం. దాన్ని వాడి ప్రజలు గెలుస్తారా లేక ప్రజలు ఓడి సంఫ్‌ు పరివార్‌ గెలుస్తుందా అనేది కాలమే చెప్పాలి. ఏమో ఎవరు చూశారు? కర్నాటకలో ప్రజలు గెలవలేదా? మంచి జరుగుతుందని ఆశిద్దాం. మనిషి ఆశాజీవి కదా!
జి. రంగారావు