ఉస్మానియాలో ఒకరు మృతి

ఉస్మానియాలో ఒకరు మృతి– అతను కోవిడ్‌తో చనిపోలేదు..: ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌
ఉస్మానియా ఆస్పత్రిలో హార్ట్‌ ఫెయిల్యూర్‌తో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతనికి కోవిడ్‌ పరీక్షల్లో పాజిటీవ్‌గా తేలింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ బండ్లగూడ, దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సుభాన్‌(60) గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం (గుండె ఆగిపోవడం), టైప్‌ 2 శ్వాసకోశ వైఫల్యంతో మెడికల్‌ ఎమర్జెన్సీతో అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో చేరాడు. పలు శస్త్ర చికిత్సలతోపాటు అన్ని రకాల పరీక్షలు చేయగా.. అతనికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అయితే, అతని గుండె పూర్తిగా పనిచేయకపోవడంతో ఈ నెల 24న మృతిచెందాడు.
మరో 3 పాజిటివ్‌ కేసులు..
ఉస్మానియా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో రాజేంద్రనగర్‌ ఎన్‌.టి.ఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన పల్లె లక్ష్మణ్‌, వికారాబాద్‌ ధారూర్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌.పార్వతమ్మ, మల్లేపల్లి అఫ్జల్‌ సాగర్‌ ప్రాంతానికి చెందిన ఎండీ అఫ్సల్‌ బేగం(12) వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్‌ అయ్యారు. వారికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కరోనాతో చనిపోయాడన్నది అవాస్తవం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌
ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆ వ్యక్తి అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ హార్ట్‌ ఫెయిల్యూర్‌తో చనిపోయాడు. కోవిడ్‌ కేసులకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ తగిన వైద్య చికిత్స అందిస్తున్నాం. కోవిడ్‌ జేఎన్‌1 తేలికపాటి లక్షణాలతో కూడిన చాలా తేలికపాటి రూపాంతరం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.