– ఆరోగ్య శ్రీ కేసుల వివరాలు సకాలంలో ఎంట్రీ చేయకపోవడంతో నిలిచిన నిధులు
– డాటా ఎంట్రీపై పర్యవేక్షణ కరువు
– ప్రతేడాదీ నష్టపోతున్న వైనం
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
తాత్కాలిక సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రెండేండ్లలో సుమారు రూ.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఆరోగ్య శ్రీ కింద రోగులకు అందజేసిన సేవలకు సంబంధించిన వివరాలు సకాలంలో ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రికి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో పెద్దమొత్తంలో ఆస్పత్రికి నష్టం వాటిల్లినట్టయింది. ఆ నిధులు వస్తే జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ, క్యాత్ ల్యాబ్ లాంటివి మిగతా పరీక్షల నిమిత్తం అవసరమైన పరికరాలను, ఇంకా ఎన్నో కొనుగోలు చేసి పేషెంట్ లకు సమయానికి వైద్యం అందిస్తూ, ఏ ఇతర ఔషధాల కోసం కూడా పేషెంట్ లు బయటకు వెళ్లకుండా.. ఆసుపత్రిలోనే అందించే విధంగా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వచ్చే డబ్బులు సరిపోయేవి. ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఇక్కడ పనిచేసే తాత్కాలిక ఉద్యోగి సరైన సమయానికి మూడు నెలల కాలపరిమితిలో పేషెంట్ వివరాలు అన్ని పూర్తిగా మూడు నెలల కాలపరిమితి లో సబ్మిట్ చేయకపోవడంతో సుమారు 8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
ఆరోగ్య శ్రీ కింద జిల్లా జనరల్ ఆస్పత్రిలో 2022 ఏప్రిల్ 1 నుండి 2023 మార్చి 31 వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద 9160 మంది రోగులకు వివిధ రకాల చికిత్సలు అందజేశారు. అయితే అందులో 5818 మంది వైద్యం చేయించుకున్న వారి బిల్లులు మాత్రమే ఆమోదితం పొంది ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా రూ.8,66,39,922 ఆమోదితం పొందినవి. మిగతా 3342 మంది రోగులకు సంబంధించినవి రిజక్ట్ అయ్యాయి. అయితే తిరిగి వాటిని మళ్లీ ఎంట్రీ చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆలస్యం చేయడంతో ఆ డబ్బులు రాలేవు.
అదే విధంగా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 8927 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసుకోగా.. అందులో 2026 మందికి సంబంధించిన రూ.2,87,32,877 రూపాయలు ఆమోదితం పొందాయి. 6901 మంది రోగుల బిల్లులు తిరస్కరణకు గురికాగా.. మూడు నెలల కాల వ్యవధిలో తిరిగి పంపకపోవడంతో ఆ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ లెక్కన రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 10,243 మంది రోగులకు సంబంధించిన సుమారు 9 కోట్ల రూపాయలు జీజీహెచ్‌కు అందకుండా పోయాయి.
ఈ బిల్లులు చెల్లింపు కాకపోవడానికి ముఖ్య కారణం తాత్కాలిక ఉద్యోగిగా పని చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్. సదరు వ్యక్తి నిర్లక్ష్యంతో ఆస్పత్రికి, చికిత్స అందజేసిన వైద్యులకు, వైద్య సిబ్బంది రావాల్సిన సుమారు 9 కోట్ల నిధులు రాకుండా పోయాయి.
పర్యవేక్షణ కరువు..?
ఆరోగ్య శ్రీ కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మొత్తం 8 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్క కేసుకు రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. ఆ డబ్బులనే అందరూ పంచుకోవాల్సి ఉంటది. కానీ అయితే వీరిలో ఒకరు పెత్తనం చెలాయించుతూ.. ఆరుగురికి ప్రత్యేకంగా రూ.19,500 వేతనం ఇప్పించడం గమనార్హం. కాగా పెత్తనం చెలాయించే వ్యక్తి పాస్ అయిన బిల్లుల ద్వారా రెండు సంవత్సరాల కాలంలో సుమారు రూ.31 లక్షలు పొందడం గమనార్హం. సదరు సిబ్బందికి చెల్లింపులు సక్రమంగా చేస్తున్నా.. ఆరోగ్య శ్రీ బిల్లులు రాకపోతే పట్టించుకునే వారు కరువైయ్యారు. పర్యవేక్షణ లేకపోవడంతో రెండు సంవత్సరాల కాలంలోనే సుమారు 9 కోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయి. ఇక నైనా ఆరోగ్య శ్రీ కేసుల ఆన్‌లైన్ నమోదుపై దృష్టిసారించి నిధులు వచ్చేలా కృషి చేసి ఆస్పత్రిలో మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.