హైదరాబాద్‌కు ఓ పాయింట్‌ రాజస్థాన్‌తో రంజీ పోరు డ్రా

One point for Hyderabad Ranji draw with Rajasthanజైపూర్‌ : రంజీ ట్రోఫీలో రెండు పరాజయాలు, ఓ విజయం సాధించిన హైదరాబాద్‌కు నాల్గో మ్యాచ్‌లో డ్రా ఎదురైంది. భారీ స్కోర్లు నమోదైన రాజస్థాన్‌, హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగుల ఆధిక్యం సాధించిన రాజస్థాన్‌కు 3 పాయింట్లు దక్కగా.. హైదరాబాద్‌కు ఒక్క పాయింట్‌ లభించింది. రాహుల్‌ (100) శతకంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా.. మహిపాల్‌ (111), శుభమ్‌ (108) సెంచరీలతో రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో 273/3 పరుగులు చేసింది. ఓపెనర్‌ తన్మరు అగర్వాల్‌ (79), అభిరాత్‌ రెడ్డి (46) రాణించారు. హిమతేజ (101 నాటౌట్‌, 176 బంతుల్లో 10 ఫోర్లు), కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (47 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. నాలుగు రోజుల ఆట అనంతరం ఫలితం తేలకపోవటంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రాజస్థాన్‌ విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఐదో రౌండ్‌ మ్యాచ్‌లో ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో హైదరాబాద్‌ తలపడనంది.