ఒకే నది.. ఇరవై రెండు ప్రవాహాలు

ఒకే నది.. ఇరవై రెండు ప్రవాహాలుఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం ఒక గొప్ప వేదిక. అనుభూతుల వేడుక. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవులకు, రచయితలకు ఎంత గొప్ప గుర్తింపు ఉంటుందో అంతటి గొప్ప గుర్తింపు ఇందులో ఎంపికైన కవులకూ ఉంటుంది. ఇలా ఎంపికైన కవులను జాతీయ కవులని పిలుస్తారు. 1956 నుంచి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తుంది.
సంస్కతం మొదలుకుని రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోంచి ఒక్కో కవితను ఎంపిక చేసి ఆయా కవులకు ఒక్కోసారి దేశంలో ఒక్కో నగరంలో జనవరి మొదటి వారంలో కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. సర్వభాషా కవులు తమ సాహిత్యాన్ని పంచుకోడానికి ఇదొక మంచి అవకాశం. ఆ కవిసమ్మేళంలో అన్ని భాషల కవితలకు హింది అనువాదం వెంటనే వినిపిస్తారు.
ఎంపికైన ఒక్కో కవితను మిగిలిన 21 భాషలలోకి అనువాదం చేయించి ఆయా భాషల రేడియో కేంద్రాల ద్వారా ప్రసారం చేస్తారు. అంటే ప్రతి ఏడాది ఎంపికైన ఒక్కో కవిత మిగిలిన అన్ని దేశ భాషల్లోకి అనువాదం అవుతుంది. ఆ కవితకి, కవికి ఆకాశవాణి అందించే గొప్ప సత్కారం ఇదే. ప్రతి భారతీయ భాషల్లో తన కవితను దేశం నలుమూలల నుండి భారతీయులందరూ వినడం కన్న ఆ కవికి కావలసింది ఏముంది. అందుకే ఈ కార్యక్రమానికి ఎంపికైన కవులు తమకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చినంత ఆనందంగా మేము జాతీయ కవులం అని చెప్పుకుంటారు.
తెలుగులో మహామహులైన మహా కవులందరూ జాతీయ కవులుగా ఎంపికైన వారే. అప్పట్లో మహాకవి శ్రీశ్రీ, కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్య నారాయణ, కష్ణశాస్త్రి, పుట్టపర్తి నారాయణా చార్యులు, సి. నారాయణరెడ్డి, దాశరథి కష్ణమా చార్యులు, ఆరుద్ర, ఆవంత్స సోమసుందర్‌, గుంటూరు శేషేంద్ర శర్మ, నాయని కష్ణకుమారి, బోయి భీమ్మన, సమీప గతంలో పైడి తెరేష్‌ బాబు, మిరియాల రామకష్ణ, సుధామ, ఐలేనిగిరి, రెంటాల వెంకటేశ్వర రావు, దేవిప్రియ, చిల్లర భవానీ, ఆర్‌.ఏ. పద్మనాభరావు, కొలకలూరి ఇనాక్‌, ప్రసాద మూర్తి, యాకుబ్‌, సూర్య ప్రకాశ్‌ ఇటీవలి కాలంలో మామిడి హరికష్ణ, ఎమ్వీ. రామిరెడ్డి, మల్లెగోడ గంగాప్రసాద్‌ ఇంకా అనేక మంది కవులు ఈ కార్యక్రమానికి ఎంపిక అయ్యారు. ఈ సంవత్సరం తెలుగు నుండి జాతీయకవిగా ఏనుగు నరసింహారెడ్డిగారు ఎంపిక అయ్యారు.
తెలుగు కవిత అతి సుందరంగా, రమణీయంగా, గాఢంగా, రసాత్మకంగా ఉంటుందనే ప్రశంసలు ఆది నుండి ఉన్నవే. ఇప్పటికీ తెలుగు కవిత వన్నె తరగకుండా తన ఉన్నతిని కాపాడుకుంటూ వస్తుంది. ఇందులో పాల్గొన్న కవులు అనేక అనుభవాలు, అనుభూతులతో తమ కవిత స్వరాన్ని దేశం నలుమూలలా వినిపించిన వారే. 1956 నుండి ఇప్పటికి ఎంపికైన ఒక్కో కవిత ఒక్కో ఆణిముత్యం. వీటన్నిటిని కలిపి ఒక పుస్తకంగా ఆకాశవాణి తీసుకువస్తే చాలా బాగుంటుంది.
ప్రతి సంవత్సరం జనవరి, 26న ప్రసారం అయ్యే తెలుగుకవిత(మూల భాష కవిత)తో పాటు ఇతర భాషా కవితల అనువాదాలు కూడా ఒక గొప్ప అనుభూతిని అందిస్తాయి. భాషకు ఎల్లలు ఉంటాయి. కవిత్వ భాషకు ఎల్లలు లేవు అనేది ఈ కార్యక్రమం వింటేనే అర్థమవుతుంది. భాష మారిన, మనిషి మారడు, బాధలు మారవు, సంతోషాలు మారవు అనేది ఈ కార్యక్రమ పరమవదిగా అవగతం అవుతుంది.
ఉర్దూ వంటి కొన్ని భాషల్లో కవితలు అత్యంత రమణీయంగా ఉంటాయని అటువంటి కవితల అనువాదం కోసం సినారే, దాశరధి, శేషేంద్ర శర్మ వంటి మహా మహులు పోటీపడే వారు. ఇటీవల కూడా గొప్ప అనుభవం ఉన్న కవులు తెలుగులో సర్వ భాషల కవితలను అనువాదం చేస్తున్నారు. కొలకలూరి ఇనాక్‌, నందిని సిధారెడ్డి, యాకుబ్‌, ముకుంద రామారావు, జింబో, తాడేపల్లి పతంజలి, సమ్మెట నాగమల్లేశ్వర రావు, శిఖామణి, సుధామ, చిల్లర భవాని దేవీ, నాళేశ్వరం శంకరం, మహెజబీన్‌, అమ్మంగి వేణుగోపాల్‌, మామిడి హరికష్ణ, అయినంపూడి శ్రీలక్ష్మీ, సుమనస్పతి రెడ్డి, శిలాలోలిత, మందలపర్తి కిశోర్‌, దర్భశయనం శ్రీనివాసాచార్య వంటి ప్రముఖులు తెలుగులో కవితలను అనువాదం చేసి వినిపిస్తున్నారు. ఆయా భాషా కవుల వ్యక్తికరణ సొంత భాష కవిత్వాన్ని విన్నట్టుగా మన కవులు అనువదించి వినిపించడం మధురానుభూతిని అందిస్తుంది.
సజనాత్మకతను ప్రోత్సహించడంలో ఆకాశవాణి ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ఒక్క నది, ఒకే నది. ఒకే నదికి ప్రవాహాలు ఇరవైరెండు. ప్రతి ప్రవాహమూ వెదజల్లే వెలుగులు అవని ఉజ్వలము అంబరమూ అంటూ సాగే సర్వభాష కవి సమ్మేళన ప్రారంభ గీతంలోని ప్రతి వాక్యం ఈ కార్యక్రమ ఔనత్యాన్ని రెట్టింపు చేసేదిగా ఉంది. సంచరమే ఎంతో బాగున్నది, దానంత ఆనందమేమున్నది అన్న కవి గోరటి వెంకన్న భావుకత నిత్య సత్యం. అటువంటి సంచార జ్ఞానాన్ని మన ఇంటినుండే అందించి అమతప్రాయమైన అనుభూతిని ఆకాశవాణి మనకు అందిస్తుంది. అలా ఒక్క రాత్రితో దేశం మొత్తం సంచరించినంత అనుభూతిని సర్వభాష కవిసమ్మేళనం అందిస్తుందంటే అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది జనవరి 25 రాత్రి 10 గంటకు కవిత విహంగాల హారంతో దేశపు వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరిద్దాం. అనుభూతులు కొమ్మలపై వాలి ఆనందాల ఫలాలను మనసునిండా నింపుకుందాం.
డా. మల్లెగోడ గంగాప్రసాద్‌
డిగ్రీ అధ్యాపకులు, కవి
7386387249