ఒకేదఫా రూ.2లక్షల రుణమాఫీ చేయాలి

– అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం వినతి
నవతెలంగాణ-దమ్మపేట
ఖరీఫ్‌ సీజన్లో ఒకేదఫా రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని, అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు 50శాతం సబ్సిడీతో ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో 2024 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వ్యవసాయ పనులు చేస్తూ వ్యవసాయానికి సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో జనుము విత్తనాలతో పాటు అన్ని రకాల విత్తనాలు ఎరువులు, పురుగు,మందులు 50శాతం సబ్సిడీతో, వ్యవసాయ ఉత్పత్తి సాధనాలు వ్యవసాయ పరికరాలు మినీ ట్రాక్టర్లు సబ్సిడీతో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళిత, గిరిజన, చిన్న, సన్నకారు ఉచితంగా ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలోనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేసి రెండింతల ఆదాయం తెచ్చి పెడతామని హామీ ఇచ్చి రైతులను మోసం చేస్తుందన్నారు. దేశంలో అనేక దశాబ్దాల కాలం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు పురుగుమందులు సబ్సిడీతో ఇచ్చేవారన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ వ్యవసాయ రంగాన్ని నాశనం చేయటానికి ఉన్న సబ్సిడీలు రద్దు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు పండూరి వీరబాబు, కుంజ కాంతారావు, తాటి వెంకటేశ్వరావు, ఏఐపీకేఎంఎస్‌ జిల్లా నాయకులు కురసం ముత్యాలరావు, బండి ఆదినారాయణ, వూకే వెంకటేశ్వరావు, జుజ్జురి ముక్తేశ్వరి, లక్ష్మీ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.