– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే..
– అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం
– రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి : జహీరాబాద్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ
నవతెలంగాణ-జహీరాబాద్
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని.. ఎల్లవేళలా ఒకరికొకరుగా ఉంటూ సహకరించుకుంటూ వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ప్రియాంక గాంధీ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీకి బిల్లులు పాస్ చేసుకునేందుకు అవసరమున్న ప్రతిసారీ బీఆర్‌ఎస్ అన్ని రకాలుగా సహకరించిందన్నారు. నేడు బీఆర్‌ఎస్, ఎంఐఎం నాయకులపై ఎక్కడైనా ఏవైనా దాడులు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని పారదోలాల్చిన బాధ్యత ప్రజలదేనని తెలిపారు. దేశంలో లౌకికతత్వాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించారన్నారు. నేడు దేశంలో అత్యధిక ధనికమైన పార్టీల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఉన్నాయని, అన్ని డబ్బులు వారికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి సన్నిహితులైన అదానీకి రూ.16 వేల కోట్ల బ్యాంకు రుణాన్ని మాఫీ చేశారని.. ఇది ఎందుకోసం చేశారన్నారు. ప్రస్తుతం ధర్మం, జాతీయతపై ఎన్నికలు నడుస్తున్నాయని.. ఈ ఎన్నికల్లో ప్రజలు ధర్మం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ది ఫామ్‌హౌస్ పాలన అని.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పాలించలేదన్నారు. యువకుల ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని.. కానీ నేడు యవకులకు ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. ఛత్తీస్‌గడ్, కర్నాటక, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. అక్కడి ప్రజలకు తాము ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఒక్కసారి అక్కడి పాలన గురించి తెల్సుకుని తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానికంగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుతోపాటు నిమ్జ్ రైతుల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. సభలో కర్నాటక మంత్రి భీమన్న కండ్రే, రెహమాన్, పార్లమెంటు పరిశీలకులు డాక్టర్ విజువల్ రెడ్డి, అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ గిరిధర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.