– ఇరిగేషన్ కార్యాలయాల్లోని పలు రికార్డులు స్వాధీనం
నవతెలంగాణ-మహదేవపూర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. మేడిగడ్డ బ్యారేజీ, పంపుహౌస్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ అందజేయాలని లేఖ రాసి 24 గంటలు గడవకముందే.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌లోని జలసౌధ వరకు 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బుధవారం రెండవ రోజు అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డీపీఆర్ ఇలా అనేక రికార్డులను అడిగి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల బృందాలు ఆయా కార్యాలయాలకు వెళ్లి తొలుత ఇంజినీర్లు, అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ కార్యాలయాల నుంచి బయటకు వెళ్లనీయకుండా ఆపేశారు.
మంగళవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు సాయంత్రం వరకు, కొన్నిచోట్ల రాత్రి 10 గంటల దాకా సాగాయి. ఉదయం కార్యాలయాలకు రాగానే ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చూసి ఏం జరుగుతుందోననే ఆందోళన ఇంజినీర్లలో నెలకొంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డుల కోసం ఈనెల 9వ తేదీన కార్యాలయానికి వస్తామని రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు విజిలెన్స్ విభాగం ఎస్పీ శివకుమార్ గత సోమవారం లేఖ రాశారు. ఇక్కడే ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయం కూడా ఉంది. అయితే ఈ లేఖ అధికారులకు చేరకముందే మంగళవారం తనిఖీలు చేపట్టి రికార్డులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. అలాగే మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంపుహౌస్‌కు సంబంధించిన రికార్డులనూ విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. కాళేశ్వరం మరో ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం కార్యాలయానికి వెళ్లి డీపీఆర్‌ను తీసుకొన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకొన్న రుణాల వివరాలను కూడా అడిగి తీసుకొన్నట్టు తెలిసింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలను మహదేవపూర్ నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయానికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది.
మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 46 అంశాలపై సమాచారాన్ని విజిలెన్స్ అధికారులు కోరారు. డీపీఆర్, కేంద్ర జలసంఘం అనుమతులు, పునాదుల వివరాలు, బ్యారేజీ, పంపుహౌస్‌ల నిర్మాణానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డ్రాయింగ్‌లు, టెండర్లు పిలిచినప్పటి నుంచి ఆమోదం పొందే వరకు వివరాలు, ఒప్పందాలు, బ్యాంకు గ్యారంటీలు, నిర్మాణ గడువు, ఉప గుత్తేదారుల వివరాలు నిర్మాణ సమయంలో తనిఖీలు, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు, ప్రతి నెలా బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఎం బుక్‌లు, ఉన్నతాధికారులు పరిశీలించినప్పుడు ఇచ్చే నోట్స్, మార్పులు జరిగి ఆమోదం పొంది ఉంటే అందుకు సంబంధించిన వివరాలు మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక, పంపుహౌస్ గోడ కూలడానికి సంబంధించిన వివరాలు, పునరుద్ధరణ పనులు, చెల్లింపులు, బ్యారేజీ వద్ద ప్లడ్ డిశ్ఛార్జి వివరాలు, ఫిర్యాదులు వచ్చి ఉంటే తీసుకొన్న చర్యలు, అదనపు టీఎంసీ పనుల వివరాలకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పగా.. అధికారులు వివరాలు తెలపడానికి నిరాకరించడం గమనార్హం.