ముమ్మరంగా కొనసాగుతున్న ఆన్లైన్ డాటా ఎంట్రీ..

Ongoing online data entry.నవతెలంగాణ – తాడ్వాయి 
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు గురువారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ముమ్మరంగా కొనసాగుతుంది. శనివారం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సుమన వాణి, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రేగ కేశవరావు, మండల పంచాయతీ రాజ్ ఆఫీసర్ (ఎం పి ఓ) జాలా శ్రీధర్ రావు లు ఆన్లైన్ డాటా ఎంట్రీని పరిశీలించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) వివరాలను ఆన్లైన్ చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వారు సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించేటప్పుడు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. తప్పులు దొర్లకుండా, సమయపాలన పాటించి తొందరగా పూర్తి అయ్యేటట్లు విధులు నిర్వహించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు పూర్తిస్థాయిలో డాటా ఎంట్రీ చేపట్టి నివేదికలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.