అమెరికాలో కొనసాగుతున్న జాతి విద్వేష ఉద్రిక్తతలు

– ఫ్లాయిడ్‌ను చంపిన అధికారికి కత్తిపోట్లు
– జైలులోనే దాడి
వాషింగ్టన్‌ : నల్లజాతి విద్వేష జాఢ్యం మూలాన అమెరికాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనేవున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకేసులో దోషిగా నిర్థారించబడి శిక్ష అనుభవిస్తున్న పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌పై జైలులోనే దాడి జరిగింది. ఆరిజోనా రాష్ట్రంలోని టుక్సాన్‌ నగరంలోని ఫెడరల్‌ కరెక్షనల్‌ ఇనిస్టిట్యూషన్‌ (ఎఫ్‌సిఐ)లో శుక్రవారం మధ్యాహ్నాం ఈ దాడి ఘటన జరిగిందని, డెరెక్‌ చౌవిన్‌ కత్తిపోట్లకు గురయ్యాడని స్థానిక మీడియా వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే స్పందించిన జైలు అధికారులు తగిన చిక్సిత చేసినట్లు తెలిపింది. 2020లో 46 ఏళ్ల నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఫ్లాయిడ్‌పై పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌ మోకాళ్లపై బలంగా కూర్చోవడంతో ‘నాకు ఊపిరి అందడం’ లేదని ఫ్లాయిడ్‌ విలవిలాడారు. అయినా చౌవిన్‌ విడిచిపెట్టలేదు. ఈ కేసులో చౌవిన్‌ను దోషిగా తేలాడు. న్యాయస్థానం ఆయనకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆగస్టు 2022 నుంచి టుక్సాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల క్రూరత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలు జరిగాయి. కాగా, మరోవైపు తనపై హత్యకేసును మరోసారి విచారించాలని పోలీస్‌ అధికారి చౌవిన్‌ దాఖలు చేసిన పిటీషన్‌ అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.