కాంగ్రెస్‌దే ఉమ్మడి నల్లగొండ..

కాంగ్రెస్‌దే ఉమ్మడి నల్లగొండ..– రెండు చోట్లా హస్తందే గెలుపు
– నల్లగొండలో భారీ మెజార్టీ
– మూడో స్థానంలో బీఆర్‌ఎస్‌
– సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ నైతిక విజయం
నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి అత్యధిక మెజార్టీ సాధించి దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 23 రౌండ్లలో కౌంటింగ్‌ నిర్వహించగా అన్ని రౌండ్లలోనూ మెజార్టీ సాధించి ముందు వరుసలో నిలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 5,59,906 ఓట్ల మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండో స్థానం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మొదట ఐదు రౌండ్లలో బీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలవగా, ఆరో రౌండ్‌ నుంచి 24వ రౌండ్‌ వరకు బీజేపీ రెండో స్థానం కొనసాగింది. ఈ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అధిక ఓట్లు సాధించి తమ పట్టును పెంచుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని ప్రజల్లో విస్తృత ప్రచారం జరగడంతో బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి పోటీ చేసిన అంజయ్య కంటే దళిత సమాజ్‌ పార్టీ నుంచి పోటీ చేసిన నందిపాటి జానయ్యకు 10 వేలకుపైగా ఓట్లు వచ్చాయి.
భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి 2,22,213 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యత సాధించారు. కాంగ్రెస్‌కు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ప్రధాన పోటీ ఇస్తారని అందరూ భావించినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గులాబీ పార్టీకి ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కొంతమేర పట్టు ఉన్నప్పటికీ కేవలం 2,50,000 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. పేద ప్రజల ఆదరణ, అభిమానంతో బరిలో నిలిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌కు 28,396 ఓట్లు వచ్చాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా పేద ప్రజల ఆదరాభిమానాలతో అన్ని ఓట్లు సాధించడం వెనుక జహంగీర్‌ నైతికంగా విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నల్లగొండలో కాంగ్రెస్‌ రికార్డు విజయం
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు

కాంగ్రెస్‌ 7,84,337
బీజేపీ 2,24,431
బీఆర్‌ఎస్‌ 2,18,417
బీఎస్పీ 7075
మెజారిటీ 5,59,906
భువనగిరి పార్లమెంటు పరిధిలో..
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు ..

కాంగ్రెస్‌ 6,23,393
బీజేపీ 4,01,380
బీఆర్‌ఎస్‌ 2,54,655
సీపీఐ(ఎం) 28,396
మెజార్టీ 2,22,013