– తగ్గనున్న ఉద్యానపంట ఉత్పత్తి
– తొమ్మిదేండ్లలో తొలిసారి ఇలా
– కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాలు
న్యూఢిల్లీ : దేశంలో తొమ్మిదేండ్లలో తొలిసారిగా ఉద్యాన పంట (పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాలు, ఇతరాలు) ఉత్పత్తి కొద్దిగా పడిపోనున్నట్టు తెలుస్తున్నది. గతేడాది 355.5 మిలియన్ టన్నులు (ఎం.టీ)గా ఉన్న ఉత్పత్తి.. 2023-24లో 355.2 ఎం.టీలకు పడిపోవచ్చని అంచనా. మిగతా అన్ని పంటల ఉత్పత్తి బాగానే ఉన్నా.. ఉల్లి ఉత్పత్తి పడిపోవటమే దీనికి కారణంగా తెలుస్తున్నది. ఒకవేళ ఈ అంచనాలే నిజమైతే.. 2014-15 తర్వాత ఏటికేడు స్థిరంగా పెరిగిన ఉద్యానపంట ఉత్పత్తి తొలిసారిగా పడిపోతుంది. 2023-24కు సంబంధించి ఇటీవల వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ముందస్తు అంచనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
2022-23 ఏడాదితో పోల్చుకుంటే.. 2023-24లో పంట విస్తీర్ణం 1 శాతం పెరిగినప్పటికీ ఉత్పత్తి పడిపోయే అవకాశ మున్నదని వివరిస్తున్నాయి. 2023లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావటంతో నేలలో తేమ శాతం తగ్గిందనీ, శీతాకాలంలో కూరగాలయ పంట ఉత్పత్తిపై ముఖ్యంగా ఉల్లి, ఆలుగడ్డపై ప్రభావం చూపిందని అధికారిక వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ కారణంగా 2022-23లో 212 ఎం.టీలుగా ఉన్న ఉత్పత్తి.. 2023-24లో 209 ఎం.టీలకు పడిపోనున్నట్టు తెలుస్తున్నది. ఇక టమాటా ఉత్పత్తి పెరగనున్నట్టు అంచనా. అలాగే, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గుమ్మడి, ఇతర పంటల ఉత్పత్తి కూడా పెరగనున్నట్టు అంచనాలు వెల్లడిస్తున్నాయి.
పండ్ల ఉత్పత్తి చక్కగానే ఉండనున్నట్టు తెలుస్తున్నది. 2022-23లో 110 ఎం.టీలుగా ఉన్న ఉత్పత్తి.. 2023-24లో 112 ఎం.టీలకు పెరగనున్నట్టు అంచనా. అరటి, మండరిన్, మామిడి ఉత్పత్తిలో పెరుగుదలే ఇందుకు కారణం. కిందటేడాదితో పోలిస్తే.. 2023-24లో ఉల్లి ఉత్పత్తి దాదాపు 16 శాతం తగ్గనున్నది. దీంతో దేశంలో ఉల్లి ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఇప్పటికే ఎగుమతులపై నిషేధం విధించింది. 2022-23లో ఉల్లి ఉత్పత్తి 302 లక్షల టన్నులుగా కాగా.. 2023-24లో ఇది దాదాపు 254 లక్షల టన్నులకు పడిపోవచ్చని అంచనా. ఉల్లి పంట అధికంగా ఉండే మహారాష్ట్రలో 34 లక్షల టన్నులు, కర్నాటకలో పది లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల టన్నులు పడిపోవటం కారణంగా మొత్తం ఉత్పత్తి తగ్గటానికి కారణమవుతున్నదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.