ఆలు, ఉల్లి ధరల ఆజ్యం

ఆలు, ఉల్లి ధరల ఆజ్యం– ఎగిసిన టోకు ద్రవ్యోల్బణం
– మేలో 2.61 శాతంగా నమోదు
– 15 నెలల గరిష్ట స్థాయికి చేరిక
న్యూఢిల్లీ : అహారోత్పత్తుల ధరలు అమాంతం పెరగడంతో దేశంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) ఎగిసి పడింది. 2024 మేలో 2.61 శాతానికి ఎగిసి.. 15 నెలల గరిష్ట స్థాయికి చేరినట్టు ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 2023లో 3.85 శాతం పెరిగింది. ఆ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. 2023 మేలో 3.48 శాతంగా నమోదయ్యింది. గడిచిన నెలలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఏకంగా 9.82 శాతానికి ఎగిసింది. ఈ సూచీ గతేడాది ఇదే నెలలో 1.63 శాతంగా ఉంది. టోకు కూరగాయల ధరలు 32.42 శాతం పెరిగాయి. ఈ సూచీ గతేడాది మేలో 20.5 శాతంగా నమోదయ్యింది. ఇదే సమయంలో 18.1 శాతంగా ఉన్న ఆలు ధరల సూచీ.. గడిచిన నెలలో ఏకంగా 64 శాతం ఎగిసింది. ఉల్లి ధరలు 7.25 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. గడిచిన మే నెలలో ప్రాథమిక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.2 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఇది 5.01 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన నెలలో ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం సూచీ యథాతథంగా 1.4 శాతంగా చోటు చేసుకుంది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రెట్టింపై 0.8 శాతానికి చేరింది.