బీసీలకు 20 టికెట్లు మాత్రమే ఇచ్చి న్యాయమెలా చేస్తారు?

–  కాంగ్రెస్‌కు పొన్నాల ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ 20 మంది బీసీలకు టిక్కెట్లిస్తే 40 మంది రెడ్లకు ఇచ్చిందనీ, అలాంటి పార్టీతో బీసీలకు న్యాయమెలా దక్కుతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వి.హనుమంతరావు సొంత నియోజకవర్గంలో ముగ్గురు బీసీలు టికెట్లడిగితే ఇవ్వకుండా ఖైరతాబాద్‌ నుంచి రోహిన్‌ రెడ్డిని తెచ్చి నిలబెట్టారని విమర్శించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్‌, ఎర్ర శేఖర్‌, ఆదిలాబాద్‌ సుజాత, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ లాంటి అనేక మంది బీసీ నేతలకు టికెట్స్‌ ఎగ్గొట్టి రెడ్డిలకు అమ్మనుకున్నారని ఆరోపించారు. సర్వేలు చేస్తున్నామనీ, ఆ సర్వేల్లో గెలిచిన వారికే టికెట్లు ఇస్తామనీ, పారాచూట్లకు టికెట్లు లేవని స్పష్టం చేసి, 40 టికెట్లను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నియంత పాలన నడుస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్‌తో బీసీలకు న్యాయం జరగడమనేది ఒక కల అని ఎద్దేవా చేశారు.