పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి 3 రోజులే 

– ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ను  వినియోగించుకోవాలి
– జిల్లాలోని  అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు
– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచంధన
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు గాను ఇక  కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, అందువల్ల ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు.పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులకు  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం  నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ  కేందలలో  (6)  ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈనెల  3 నుండి( శుక్రవారం) ప్రారంభమైన ఈ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఈనెల 8 వరకు (బుధవారం) వరకు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు, పోలీసులు, పివో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బంది ,ఎన్నికల విధులుకై నియమించబడిన ఇతర ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకుగాను, కేంద్ర ఎన్నికల సంఘం  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. దేవరకొండలో ఎం కె ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నిడమనూరులో తెలంగాణ మోడల్ స్కూల్, మిర్యాలగూడలో కేఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, చండూరులో జడ్పీహెచ్ఎస్, నకిరేకల్ లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఉద్యోగులు వారికి కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.